Ramoji Rao: తెలుగు సారథి.. వెలుగు వారధి

రామోజీరావు పనిని ప్రేమిస్తారు. సవాళ్లను ఆహ్వానిస్తారు.   సాహసాలకు సిద్ధపడతారు. కొత్తదనం కోసం నిత్యం పరితపిస్తారు. బృందస్ఫూర్తిని ప్రోత్సహిస్తారు. ఏం చేసినా, చేయించినా అందులో ప్రజాప్రయోజనాన్ని చూస్తారు.

Updated : 09 Jun 2024 08:00 IST

నుడిని ప్రేమించిన భాషాభిమాని
మాధ్యమాలను మలుపు తిప్పిన దిగ్గజం
రామోజీ జీవనయానంలో మైలురాళ్లెన్నో..

రామోజీరావు పనిని ప్రేమిస్తారు. సవాళ్లను ఆహ్వానిస్తారు.   సాహసాలకు సిద్ధపడతారు. కొత్తదనం కోసం నిత్యం పరితపిస్తారు. బృందస్ఫూర్తిని ప్రోత్సహిస్తారు. ఏం చేసినా, చేయించినా అందులో ప్రజాప్రయోజనాన్ని చూస్తారు. ఆఖరి శ్వాస వరకు ఇదే ఒరవడి కొనసాగించారు. అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక రంగాల్లో చెరగని ముద్ర వేశారు రామోజీరావు.

రామోజీరావు పేరు వింటేనే తెలుగు వారందరికీ ఒక స్ఫూర్తి . తెలుగు వారికీ, తెలుగు నేలకీ ఆయన చేసిన సేవ చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది. తెలుగు పత్రికారంగంలో గ్రాంథిక వాసనల్ని పూర్తిగా తుడిచి పెట్టి  ప్రజల భాషకి పట్టం కట్టింది ఈనాడే. అచ్చ తెలుగు పదాలు, నుడికారాలు, తీరైన వాక్యాలు ఈనాడు భాషాసిరులు. శీర్షిక ఆకర్షణీయంగా ఉండి పాఠకుణ్ని వార్తలోకి లాక్కెళ్లాలనేది రామోజీరావు ధోరణి. ‘తెలుగుదేశం సూపర్‌హిట్‌’, ‘జనమా.. బంతిపూల వనమా!’, ‘హితులారా.. ఇక సెలవు’, ‘చేసింది చాలు.. గద్దె దిగు లాలు’, ‘మామూళ్లు ఇవ్వకుంటే నూరేళ్లు నిండినట్లే’.. వంటి ఈనాడు శీర్షికలు అలాంటివే. తెలుగు భాష పూర్తిగా ఆంగ్లమయం అవుతున్న తీరు రామోజీరావును కలిచివేసేది. తను ప్రాణ సమానంగా భావించే ‘ఈనాడు’లో ఇంగ్లిషు పదాలను వీలైనంతగా పరిహరించాలని కంకణం కట్టుకున్నారు. పత్రికలోనూ, ఈటీవీ వార్తల్లోనూ ఆ ఒరవడిని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో వందల కొద్దీ తెలుగు పదాలు పురుడుపోసుకున్నాయి. సంపాదక బృందంలో పనిచేసే ప్రతి ఒక్కరూ పద సృష్టికర్త అయ్యారు. దస్త్రం (ఫైల్‌), బిందు సేద్యం (డ్రిప్‌ ఇరిగేషన్‌), గుత్తేదారు (కాంట్రాక్టర్‌), మేఘమథనం (క్లౌడ్‌ సీడింగ్‌), శతకం (సెంచరీ) వంటి పదాలు, ఐకాస (జేఏసీ), అనిశా (ఏసీబీ), తెదేపా (టీడీపీ), భారాస (బీఆర్‌ఎస్‌), తితిదే (టీటీడీ) వంటి ఎన్నో పదరూపాలు ఈనాడు, ఈటీవీల్లో పుట్టాయి. కొన్ని ఈ రెండు మాధ్యమాల ద్వారా బహుళ ప్రచారంలోకి వచ్చాయి. బల్దియా (మున్సిపల్‌ కార్పొరేషన్‌), లష్కర్‌ (సికింద్రాబాద్‌), గల్లీ (వీధి), ముక్కాలు (ముప్పావు) వంటి మాండలిక పదాల్ని కూడా ఈనాడు, ఈటీవీలు ప్రాచుర్యంలోకి తెచ్చాయి.

తెలుగు వెలుగులీనాలని..

ఈ కృషికి కొనసాగింపుగా ఆవిర్భవించిందే రామోజీ ఫౌండేషన్‌. భాషా సేవకులు, ప్రేమికులు, అభిమానుల ఆకాంక్షల్ని ఒకచోటకు చేర్చి తెలుగు భాషకు వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో 2012లో రామోజీరావు తెలుగు వెలుగు ప్రారంభించారు. తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో, అంత అధునాతన లక్షణాలు కలిగిందని ఆయన నమ్ముతారు. ఎలాంటి భావాల్ని అయినా వెలిబుచ్చడానికి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచడానికి, సంగీత సాహిత్యాల్ని సృజించడానికి తెలుగు ఎంతో అనుకూలమైనా, తెలుగు మాధ్యమంలో చదువులు సాగకపోవడం వల్లే తెలుగు జాతికి ఈ దురవస్థ అంటారు. ఆయన దృష్టిలో.. మాతృభాషని మరచిపోయిన జాతికి మనుగడ లేదు. తెలుగు భాష అంటే అభిమానంతోనే తన చిన్న కుమారుడు సుమన్‌కి కొండవీటి వెంకటకవి వద్ద ఏడేళ్లపాటు భాష, సాహిత్యాలపై శిక్షణ ఇప్పించారు. మనవరాళ్లు, మనవడితో తెలుగులోనే మాట్లాడేవారు. ఒక్క ఆంగ్లపదం దొర్లకుండా తెలుగులో మాట్లాడాలని వారితో పోటీ పెట్టుకోవడం ఆయనకు అలవాటు. రామోజీరావుది మొదటి నుంచీ వినూత్న శైలి. 1978లోనే ‘విపుల’, ‘చతుర’ సాహిత్య పత్రిక(ల్ని ప్రారంభించడం ఇందుకొక ఉదాహరణ. ప్రపంచ భాషల్లోని అత్యుత్తమ కథల్ని అనువదించి తెలుగు వారికి అందించడానికి ఆయన ‘విపుల’ పత్రికను తెచ్చారు. ఇలాంటి ప్రయత్నం, ప్రయోగం అంతకుముందెన్నడూ, ఎక్కడా లేదు. ఉత్తమ సాహిత్యాన్ని నెలనెలా నవల రూపంలో, చౌకగా పాఠకులకు అందించాలనే ఆలోచనతో మొదలైంది ‘చతుర’ పత్రిక. ఇదీ ఒక విభిన్న ఆలోచనే.

‘స్థానిక’ అంశాలతో అనుబంధం

1989లో ‘ఈనాడు’ జిల్లా పత్రికల ఆవిష్కరణ.. రామోజీరావు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల్లో కీలకమైనది. ఈ అనుబంధ పత్రికలు స్థానిక వార్తలకు పట్టంగట్టి తెలుగునాట జర్నలిజం రూపురేఖల్ని మార్చివేశాయి. సామాన్యుల ఆకాంక్షలకు అద్దం పట్టాయి. పాలనలో పారదర్శకతకు తలుపులు తెరిచాయి. జిల్లా పత్రికల వల్ల కొత్త తరం నాయకులు ప్రాచుర్యంలోకి వచ్చారు. దేశంలోని దాదాపు అన్ని భాషల పత్రికలూ కాలక్రమంలో ఇదే పంథాను అనుసరించడం ఆయన దార్శనికతకు తార్కాణం. రామోజీరావు సంపాదకత్వంలో వెలువడిన తొలి పత్రిక.. ‘అన్నదాత’ దేశంలోనే అగ్రగామి వ్యవసాయ మాసపత్రికగా ఖ్యాతి పొందింది. 1969లో దీన్ని ప్రారంభించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు రైతులంటే ఎంతో అభిమానం. అన్నదాతల మేలు కోసం ‘ఈనాడు’ దినపత్రికలో సైతం ‘రైతేరాజు’ శీర్షికను ప్రవేశపెట్టారు. ఈ వ్యాసాల్ని రైతులు మాట్లాడుకునే భాషలో ఇవ్వడం వల్ల వారి ఆదరణకు పాత్రమైంది.

సవాళ్లతో సహవాసం..

గృహిణులు పెట్టుకునే పచ్చళ్లను పరిశ్రమగా ప్రారంభించి, కార్పొరేట్‌ స్థాయికి తీసుకెళ్లినా.. పరస్పర విశ్వాసమే ఆలంబనగా నడిచే చిట్‌ఫండ్‌ వ్యాపారంతో వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధించినా.. అందుకు ఆయన దూరదృష్టి, కార్యదీక్షలే దోహదపడ్డాయి. ఆయనది సవాళ్లను అవకాశాలుగా మార్చుకొనే స్వభావం. సవాళ్లు లేని జీవితం ఆయనకు నిస్సారం. రామోజీరావు తమ సంస్థల్లోని నియమనిబంధనల్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. ప్రజలకు సంబంధించిన సమాచారమే వార్తాంశం కావాలని ఆయన నియమం. తన మాతృమూర్తి మృతి సమాచారం కూడా ‘ఈనాడు’లో వార్తగా రావడానికి ఆయన అంగీకరించలేదు. 

ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం..

రామోజీరావు జీవితంలో శిఖర సమానమైనది 1984 నాటి ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమం. తెలుగుదేశం పార్టీని నిలువునా చీల్చి ఏడాదిన్నర ప్రాయంలోనే ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు ‘ఈనాడు’ దినపత్రిక విశ్వరూపం చూపింది. తెలుగునాడు యావత్తూ భగ్గుమంది. దేశం మొత్తానికి నెల రోజుల పాటు ఈ అంశమే కేంద్ర బిందువైంది. రాజకీయ పక్షాలకు, మేధావులకు, న్యాయకోవిదులకు ఇదే వార్తాంశం. ఈ పోరాట ఫలితంగానే.. నాటి ప్రధాని ఇందిరాగాంధీ నెల రోజులు తిరక్కుండానే ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠించవలసి వచ్చింది. దేశంలోనే అదొక అపూర్వ ఘట్టం.

కీర్తికి కలికితురాయిగా.. 

ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, శ్రీశ్రీ రవిశంకర్‌ విశ్వవిద్యాలయాలు రామోజీరావును డాక్టరేట్లతో గౌరవించాయి. ప్రతిష్ఠాత్మక యుధ్‌వీర్, కెప్టెన్‌ దుర్గాప్రసాద్‌ చౌధురి (రాజస్థాన్‌), బి.డి. గోయెంకా వంటి అనేక అవార్డులు ఆయనను వరించాయి. దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ కూడా ఆయన కీర్తి కిరీటంలో చేరింది.


సహజ పాత్రికేయుడు

రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకునిగా, సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎన్నో రంగాల్లో రాణించారు. అన్నింటిలోకి జర్నలిజమే ఆయనకు అమితంగా ఇష్టమైనది. రోజులో ఎక్కువ సమయం దీనికే కేటాయిస్తారు. వర్తమాన వ్యవహారాల్ని ఆయన నిశితంగా పరిశీలిస్తారు. తెలుగు నుడి, పద ప్రయోగం, వాక్యనిర్మాణంపై ఆయనకు పట్టు ఎక్కువ. చెప్పాల్సిన విషయం అక్షరాల్లో నూరుశాతం ప్రతిబింబించేంత వరకు ఆయన పట్టు విడవరు. సంపాదకుడు అంటే ఆయనే. న్యూస్‌ ప్లానింగ్, న్యూస్‌ జడ్జిమెంట్‌ రామోజీరావు నుంచే నేర్చుకోవాలి. ఈనాడు ఇన్ని విజయ శిఖరాలకు చేరుకోవడానికి ఆయనలోని సహజసిద్ధమైన పాత్రికేయుడే ప్రధాన కారణం. 


ఫిల్మ్‌సిటీ.. ఒక రికార్డు

రామోజీ ఫిల్మ్‌ సిటీకి వచ్చిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ను అందుకుంటూ...

హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ నిర్మాణం కావడం తెలుగు వారికి ఎంతో ప్రాచుర్యాన్ని, గుర్తింపును తెచ్చింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా నిర్మాణ కేంద్రంగా గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లో నమోదైంది. దేశంలోని అన్ని భాషల సినిమాలూ ఇందులో నిర్మితమవుతున్నాయి. రామోజీరావు.. ఉర్దూ నుంచి కన్నడం వరకు, గుజరాతీ నుంచి బంగ్లా వరకు ఎన్నో ప్రాంతీయ భాషల్లో టెలివిజన్‌ ఛానళ్లను తెలుగునేలపై ఆవిష్కరించడం భాగ్యనగరానికీ ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులు, సృజనశీలురు, రచయితలు వీటిలో పనిచేయడానికి హైదరాబాద్‌ వచ్చారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో 13 భాషల్లో వార్తలు అందించే ఈటీవీ భారత్‌ భవనం.. ఆయా భాషల జర్నలిస్టులు, సాంకేతిక నిపుణులతో ఒక మినీ పార్లమెంట్‌ను తలపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు