Andhra Pradesh: కలప మాఫియాతో అటవీ అధికారుల చెట్టపట్టాల్‌?

అధికార పార్టీ నేతల అండదండలతో మన్యంలో కలప మాఫియా రెచ్చిపోతోంది. పచ్చని వనాలను నరికేస్తోంది. అక్రమ కలప రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారు. 

Updated : 29 May 2024 08:41 IST

మన్యంలో విలువైన వృక్షాల మాయం వెనుక వీరిదే కీలక పాత్ర
అనుమతుల్లేకుండానే రోడ్డేసిన ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరుడు
సూత్రధారులను వదిలేసి కిందిస్థాయి సిబ్బందిపైనే చర్యలు

మారేడుమిల్లి మండలం దేవరపల్లి సెక్షన్‌ నూరుపూడిలో టేకు చెట్ల మాయంపై గతంలో విచారణ చేస్తున్న ఉన్నతాధికారులు

ఈనాడు, పాడేరు: అధికార పార్టీ నేతల అండదండలతో మన్యంలో కలప మాఫియా రెచ్చిపోతోంది. పచ్చని వనాలను నరికేస్తోంది. అక్రమ కలప రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారు. ఫలితంగా అడవిలో విలువైన టేకు, మారుజాతి వృక్షాలు మాయమైపోతున్నాయి. ‘అడవి అంతా అధికార పార్టీ నేతలే దోచుకుంటే ఎట్టా?, మనం కూడా ఎంతో కొంత సంపాదించుకోవాల’ని అనుకున్నారేమో మారేడుమిల్లి మండలంలో టేకు చెట్లను అటవీశాఖ సిబ్బందే మాయం చేశారు. దేవరపల్లి అటవీ సెక్షన్‌ పరిధిలోని నూరుపూడి అటవీ ప్రాంతంలో 40 నుంచి 50 ఏళ్ల వయసున్న 450 టేకు చెట్లను అక్రమంగా నరికి తరలించేశారు. వాటి విలువ రూ.91 లక్షలని అంచనా. దీనికి బాధ్యులుగా డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌(డీఆర్వో) జాన్‌బాబు, బీటు అధికారి శ్రీలక్ష్మివసంతను సస్పెండ్‌ చేశారు. ఈ చెట్లను నరికి మాయం చేసిన ఉదంతంలో ఓ ఉన్నతాధికారి, అధికార పార్టీ నేత పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు అధికారి ఐటీడీఏ పరిధిలో ఇద్దరు ఐఏఎస్, ఒక ఐపీఎస్‌ అధికారులకు ఫర్నిచర్‌ తయారు చేయించి కానుకలుగా ఇచ్చినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో మరోసారి విచారణ చేపట్టినా ఆ ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోకుండా ఫారెస్టు రేంజ్, సెక్షన్‌ అధికారులిద్దరితో పాటు ఓ గార్డును సస్పెండ్‌ చేసి చేతులు దులిపేసుకున్నారు. మరోవైపు కొయ్యూరు మండలం కాకరపాడు సెక్షన్‌ పరిధిలో జాతీయ రహదారి నిర్మాణ పనుల ముసుగులో అటవీ శాఖ పరిధిలోని మారుజాతి వృక్షాలను కొట్టి తరలించుకుపోయారు. దీంట్లోనూ అటవీ శాఖ అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి బాధ్యులుగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంటూ ఫారెస్టు అధికారితో పాటు ఇద్దరు బీటు అధికారులు, దిగువ స్థాయి సిబ్బందిని తాజాగా సస్పెండ్‌ చేశారు. 

వై.రామవరం మండలం తాడికోట అటవీ ప్రాంతంలో అనుమతుల్లేకుండానే వేసిన రోడ్డు

అనుమతుల్లేకుండానే అడవిలోకి రోడ్డు..

అడవిలో చిన్న చెట్టు కొట్టాలన్నా, నిర్మాణం చేపట్టాలన్నా అటవీ శాఖ నుంచి అనుమతులు తప్పనిసరి. అటవీ భూభాగంలో ప్రభుత్వమే రోడ్డు నిర్మించాలన్నా అందుకు అవసరమైన భూమిని ఇతర ప్రాంతాల్లో అటవీ శాఖకు బదిలీ చేయాల్సి ఉంటుంది.  అలాంటిది వై.రామవరం మండలంలోని మారుమూల తాడికోట గ్రామానికి ఎలాంటి అనుమతులు లేకుండానే రోడ్డు నిర్మించేశారు. కాకినాడకు చెందిన ఓ వ్యక్తికి బినామీల పేరుతో ఆ గ్రామంలో 25 ఎకరాల పైగా భూమి ఉంది. అందులో విలువైన టేకు, మారుజాతి చెట్లు పెంచుతున్నారు. వాటిని కొట్టి తరలించడానికి సరైన మార్గం లేకపోవడంతో తానే సొంతంగా రెండున్నర కి.మీ. మేర యంత్రాలతో చదును చేసి గ్రావెల్‌ రోడ్డు వేసేశారు. ఈయన స్థానిక వైకాపా నేత, ఎమ్మెల్సీ అనంత బాబుకు అనుచరుడు కావడంతో అటవీ అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. అయితే కొంతమంది గిరిజనులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో రోడ్డు పనులను చివర్లో అడ్డుకున్నారు. ఈ రోడ్డు వేసిన ఎమ్మెల్సీ అనుచరుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అటవీ శాఖలో దిగువ స్థాయి సిబ్బంది ఓ బీటు అధికారిని సస్పెండ్‌ చేసి సరిపెట్టేశారు.


ముగ్గురు అటవీ అధికారుల సస్పెన్షన్‌

రంపచోడవరం, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం రేంజ్‌ అధికారి ఆజాద్, మారేడుమిల్లి అటవీ సెక్షన్‌ అధికారి సుమంత్, గార్డు శివారెడ్డిలను సస్పెండ్‌ చేస్తూ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ చిరంజీవి చౌదరి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మారేడుమిల్లి రేంజ్‌ పరిధి దేవరపల్లి అటవీ సెక్షన్‌ పరిధిలో అయిదు నెలల క్రితం అటవీ అధికారుల అండదండలతో స్మగ్లర్లు సుమారు 450 టేకు చెట్లను నరికేసి తరలించుకుపోయారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఇప్పటికే డీఆర్వో జాన్‌బాబు, బీట్‌ అధికారిణి శ్రీలక్ష్మివసంతలను సస్పెండ్‌ చేశారు. తాజాగా ఉన్నతాధికారులు దేవరపల్లి సెక్షన్‌లో విచారణ చేపట్టి మరో ముగ్గురు అధికారులపై వేటు వేశారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని