Andhra Pradesh: పక్కా ప్రణాళికతోనే రద్దీ నియంత్రణ

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ వేదిక ఉన్న కేసరపల్లిలో 12వ తేదీన ట్రాఫిక్‌ నియంత్రణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Updated : 11 Jun 2024 06:00 IST

జాతీయ రహదారిపై 12న ట్రాఫిక్‌ కష్టాలకు అవకాశం
విమాన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ దారులు మేలు 

చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై సోమవారం నిలిచిపోయిన వాహనాలు 

ఈనాడు, అమరావతి: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ వేదిక ఉన్న కేసరపల్లిలో 12వ తేదీన ట్రాఫిక్‌ నియంత్రణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి ఉంది. కేసరపల్లి కూడలి దాటాక ప్రమాణ స్వీకార ప్రాంగణానికి వాహనాలు వెళ్లేందుకు వీలుగా రహదారిపై డివైడర్‌ను సోమవారం కొంత భాగం తొలగించారు. ఆ మార్గంలోనే జాతీయ రహదారిపై పొక్లయిన్లతో పనులు చేస్తుండడంతో వాహనాలు నాలుగు కి.మీ.మేర నిలిచాయి. ఫలితంగా మూడున్నర గంటలపాటు ట్రాఫిక్‌ నెమ్మదించింది. పనులు ముగిశాక కూడా పోలీసులు వాహనాలను సరిగా నియంత్రించలేకపోయారు. జాతీయ రహదారిపై భారీ వాహనాల మళ్లింపులను మంగళవారంనుంచే అమలుచేసి లోటుపాట్లను గుర్తించి బుధవారం పక్కా కార్యాచరణను కొనసాగిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కృష్ణా జిల్లా కంకిపాడు, పునాదిపాడు మీదుగా కేసరపల్లి వద్ద భారీ వాహనాలు జాతీయ రహదారిపైకి ఎక్కుతున్నాయి. ఫలితంగా ఈ కూడలిలో రద్దీ ఉంటోంది. ప్రత్యామ్నాయ మార్గాలను చూడాల్సి ఉంది. ప్రమాణ స్వీకార వేదిక ఎదురుగానే గన్నవరం విమానాశ్రయం ఉండడంతో విమాన ప్రయాణికులకు ఇక్కట్లు తప్పేలా లేవు. విజయవాడ వైపు నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే వారు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న విశాలమైన రోడ్లను గరిష్ఠంగా వినియోగించుకోవాల్సి ఉంది.

 మొగల్రాజపురంలో అమ్మ కల్యాణమండపం నుంచి ఈఎస్‌ఐ మీదుగా గుణదల వరకు సువిశాలమైన రోడ్డు ఉంది. ఈ రోడ్డుపై వస్తే నేరుగా గుణదల మీదుగా రామవరప్పాడు కూడలి వద్ద ఫ్రీలెఫ్ట్‌ తీసుకుని జాతీయ రహదారి ఎక్కే అవకాశముంది. గన్నవరం వైపు వెళ్లేందుకూ అవకాశం ఉంటుంది. పటమట నుంచి ప్రయాణించేవారు బెంజి సర్కిల్‌ వచ్చి జాతీయ రహదారిపైకి వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా తాడిగడప వంద అడుగుల రోడ్డు మీదుగా ఎనికేపాడు వద్ద రహదారిపైకి చేరే అవకాశముంది. 

తొమ్మిదిన్నరకే విమానాశ్రయానికి చేరుకోవాలి

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అభిముఖంగానే ప్రమాణ స్వీకార సభ జరగనుండడంతో ఆ రోజు విమాన ప్రయాణికులు ఉదయం 9:30 గంటలలోపే విమానాశ్రయానికి చేరుకోవడం మంచిదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు