Polavaram: ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీకి కట్టడి ఎలా?

పోలవరం ప్రాజెక్టుకు పెను సవాల్‌గా నిలిచిన ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీ పరిష్కారానికి అధికారులు దారులు వెతుకుతున్నారు. కేంద్ర జలసంఘం సూచన మేరకు గుత్తేదారు ఏజెన్సీ సంస్థ తరఫున ఆఫ్రి డిజైన్‌ కన్సల్టెన్సీ సంస్థను నియమించారు.

Updated : 22 May 2024 05:53 IST

24 నుంచి జియో టెక్నికల్‌ పరీక్షలు
ఆఫ్రి సంస్థ డిజైన్లు
ఫుగ్రో సంస్థ పనులు

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు పెను సవాల్‌గా నిలిచిన ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీ పరిష్కారానికి అధికారులు దారులు వెతుకుతున్నారు. కేంద్ర జలసంఘం సూచన మేరకు గుత్తేదారు ఏజెన్సీ సంస్థ తరఫున ఆఫ్రి డిజైన్‌ కన్సల్టెన్సీ సంస్థను నియమించారు. తొలుత అసలు సీపేజీకి కారణం ఏమిటో తెలుసుకునేందుకు జియో టెక్నికల్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షలు మే 24న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు దిగువ కాఫర్‌ డ్యాం చివర్లో కొంత మేర తవ్వి ప్రధాన డ్యాం ప్రాంతం నుంచి డిప్లీటింగ్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి సీపేజీ నీటిని కిందికి తరలించాలని చూస్తున్నారు. 

పోలవరం ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా గోదావరి నదిపై అడ్డంగా ప్రధాన రాతి, మట్టి కట్ట నిర్మాణం చేపట్టాలి. ఇందుకు వీలుగా నదిపై ఆ ప్రధాన డ్యాంనకు ఎగువన, దిగువన రెండు కాఫర్‌ డ్యాంలు నిర్మించారు. వీటి వల్ల ప్రధాన డ్యాం వద్ద పనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు స్పిల్‌ వే మీదుగా మళ్లిపోవాల్సి ఉంటుంది. కానీ, కాఫర్‌ డ్యాంల లీకేజీతో నీరంతా పనులు చేయాల్సిన చోటుకు చేరుతోంది. ఈ సమస్యతో కిందటి సీజన్‌ అంతా ఏ పనులూ చేయలేకపోయారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణ లోపాల వల్ల సీపేజీ అంచనాలకు మించిపోయింది. వరదల సమయంలో ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రదేశంలో దాదాపు 5 మీటర్ల ఎత్తున నీరు నిలిచిపోతోంది. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర జల సంఘం, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్, కేంద్ర జల్‌శక్తిశాఖ అధికారులు పలుసార్లు చర్చించారు. ప్రధాన డ్యాంలో లీకేజీ నీటిని ఎత్తిపోయడం ఖర్చుతో కూడుకున్న పని. ఒకవేళ ఎత్తిపోసినా వర్షాలకు మళ్లీ చేరుతుంది. దీంతో ఎగువ కాఫర్‌ డ్యాం నుంచి గ్రావిటీ ద్వారా బయటకు పంపే అంశంపై అధికారులు దృష్టి సారించారు. 

 ఫుగ్రో కంపెనీకి పరీక్షల పనులు

ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీని అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు కనిపెట్టేందుకు అంతర్జాతీయ డిజైన్‌ కంపెనీ ఆఫ్రి సేవలు తీసుకుంటున్నారు. జియో టెక్నికల్‌ పరీక్షల డిజైన్‌ను ఆఫ్రి రూపొందించింది. ఇక్కడ గోదావరి గర్భంలో జెట్‌ గ్రౌటింగ్‌తో కట్‌ ఆఫ్‌ వాల్‌ నిర్మించి ఆ పైన కోర్‌తో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించారు. దీంతో ఎక్కడ నుంచి సీపేజీ వస్తోంది? ఎందుకు వస్తోంది అని తేల్చే పనిలో పడ్డారు. ఎగువ కాఫర్‌ డ్యాంపై దాదాపు 17 చోట్ల తవ్వి కోర్‌ నిర్మాణంలో, దిగువ జెట్‌ గ్రౌటింగు వద్ద ఉన్న మెటీరియల్‌ సేకరించి పరీక్షిస్తారు. ఎక్కడెక్కడ సీపేజీ ఉందో గుర్తించారు. ఆ తర్వాత పరిష్కార మార్గాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు నెదర్లాండ్స్‌కు చెందిన ఫుగ్రో అంతర్జాతీయ సంస్థ చేయనుంది. మే 24 నుంచి పరీక్షలు ప్రారంభిస్తారు.

ప్రధాన డ్యాం వద్ద సీపేజీ నీటిని గ్రావిటీ ద్వారా బయటకు పంపాలని దిగువ కాఫర్‌ డ్యాం అనుసంధానమయ్యే కొండ వద్ద ఒక డిప్లీటింగు ఛానల్‌ తవ్వారు. సీపేజీ నీటిమట్టం కంటే గోదావరిలో తక్కువ నీరున్నప్పుడు ఈ ఛానల్‌ ద్వారా బయటకు వదలాలనేది ప్రణాళిక. ఈ మేరకు ఆ ఛానల్‌ వద్ద 2 గేట్లు ఉండేలా ఒక స్లూయిస్‌ నిర్మాణం పనులు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని