Volunteers: రెంటికీ చెడిన 1.08 లక్షల మంది వాలంటీర్లు

వైకాపా ఎమ్మెల్యేలు చెప్పారనో, ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారనో రాజీనామా చేసిన గ్రామ, వార్డు వాలంటీర్ల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.

Updated : 11 Jun 2024 08:52 IST

వైకాపా ఒత్తిళ్లతో రాజీనామా చేసిన ఫలితం!

ఈనాడు, అమరావతి: వైకాపా ఎమ్మెల్యేలు చెప్పారనో, ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారనో రాజీనామా చేసిన గ్రామ, వార్డు వాలంటీర్ల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఉన్నదాంతో పాటు రాబోతున్న అదనపు ఆర్థిక ప్రయోజనాలూ కోల్పోతున్నామని వాపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా 1,08,273 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వీరిలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 6,398, పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యల్పంగా 515 మంది ఉన్నారు.

ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారం చేయాలన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఒత్తిళ్లతో వీరు వాలంటీరు ఉద్యోగాలను వదులుకున్నారు. వీరిలో చాలామంది ప్రచారంలో వైకాపా అభ్యర్థులకు అండగా నిలబడ్డారు. ఓటర్లకు తాయిలాల పంపిణీలో కీలకంగా వ్యవహరించారు. తీరా, ఎన్నికల్లో వైకాపా బోర్లా పడటం, ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తమ భవిష్యత్తేంటని ప్రశ్నిద్దామన్నా, వైకాపా నేతలు ముఖం చాటేస్తున్నారని వాపోతున్నారు. ఒత్తిళ్లకు తలొగ్గక కొనసాగిన వారంతా మంచి రోజులు రాబోతున్నాయని ఆశిస్తున్నారు. వాలంటీర్ల పారితోషికం రెట్టింపు చేస్తామన్న చంద్రబాబు హామీ వారిని ఊరిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని