AP news: విజయవాడలో కలుషిత నీటికి ఒకరి బలి

కలుషిత నీరు తాగి వాంతులు, విరేచనాలతో బాధ పడుతూ ఒకరు మృతి చెందారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరిన సంఘటన విజయవాడ మొగల్రాజపురంలోని పటమటవారి వీధిలో చోటుచేసుకుంది.

Updated : 28 May 2024 06:02 IST

 పలువురికి అస్వస్థత

మృతుడు వల్లూరు దుర్గారావు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: కలుషిత నీరు తాగి వాంతులు, విరేచనాలతో బాధ పడుతూ ఒకరు మృతి చెందారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరిన సంఘటన విజయవాడ మొగల్రాజపురంలోని పటమటవారి వీధిలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం... పటమటవారి వీధికి చెందిన వల్లూరు దుర్గారావు(47)కు ఆదివారం ఉదయంనుంచి అకస్మాత్తుగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. అర్ధరాత్రికి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో కుటుంబసభ్యులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

నీటిలో అడుక్కు చేరిన మలినాలు

అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని, ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. కుటుంబసభ్యులు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్తుండగా దుర్గారావు మృతి చెందారు. ‘నగరపాలక సంస్థ కొళాయిలకు సరఫరా చేసే తాగునీటినే వాడుతున్నాం. కొద్ది రోజుల నుంచి మలినాలు వస్తున్నాయి. విషయాన్ని సంబంధిత సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదు. నా భర్త కలుషితమైన నీరు తాగే చనిపోయారు’ అని దుర్గారావు భార్య నాగమణి రోదిస్తున్నారు. ఈ నీరు తాగిన మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లోనే ఉన్నారు. మరికొందరు వైద్యం చేయించుకొని ఇంటికి వచ్చారు. తాగునీరు కలుషితం కాలేదని నగరపాలక సంస్థ నీటి సరఫరా విభాగం డీఈ ఏసుబాబు వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని