CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏపీతో కలిసి నడుస్తాం

రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 23 May 2024 03:32 IST

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
మనవడి పుట్టెంట్రుకలు సమర్పించి శ్రీవారి సేవలో పాల్గొన్న ముఖ్యమంత్రి

శ్రీవారి ఆలయం ఎదుట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, గీత దంపతులు,

కుమార్తె నైమిషా, అల్లుడు సత్యనారాయణరెడ్డి, కుటుంబసభ్యులు 

తిరుమల, న్యూస్‌టుడే: రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి తిరుమల ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా తితిదే ఈవో తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు తన మనవడి పుట్టెంటుకల చెల్లింపు మొక్కును కుటుంబసభ్యులతో కలిసి పూర్తి చేశారు. ఆలయం వెలుపల తెలంగాణ సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎంను త్వరలో కలిసి సమస్యలు పరిష్కరించుకుని కలిసికట్టుగా నడుస్తామని అన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఒకరికొకరు సహకరించుకోవాలని   తాను ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. తిరుమలలో  తెలంగాణ ప్రభుత్వం తరఫున సత్రం, కల్యాణ మండపం నిర్మిస్తామని.. శ్రీవారి సేవలో  తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. రాజకీయాలపై విలేకరులు ప్రస్తావించగా.. తిరుమలలో వద్దని వారించారు. రైతులను ఆదుకుని దేశ సంపద పెంచాలన్నది తమ ఆలోచన అని తెలిపారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున భక్తులు ఆలయం వద్దకు చేరుకోవడంతో అభివాదం చేస్తూ తిరుగుపయనమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని