AP Poll violence: ఎన్నికల సంఘానికి ఎందుకంత భయం?

ఎన్నికల షెడ్యూలు వచ్చాక ఎన్నికల సంఘానికి అసాధారణ అధికారాలుంటాయి. రాష్ట్ర యంత్రాంగాన్ని తమ పరిధిలోకి తీసుకుని నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించడం దాని విధి.

Updated : 24 May 2024 06:24 IST

వైకాపా అరాచకాలు, దుశ్చర్యలపై కఠినంగా వ్యవహరించని ఈసీ
ఈవీఎం ధ్వంసంపై కేసు నమోదులో ఉద్దేశపూర్వక జాప్యం.. ఎమ్మెల్యే పిన్నెల్లిని కాపాడే యత్నం 
సిట్‌ లేకుంటే.. గుర్తుతెలియని  వ్యక్తులంటూ ముగించే వ్యూహమే

ఈనాడు, అమరావతి: ఎన్నికల షెడ్యూలు వచ్చాక ఎన్నికల సంఘానికి అసాధారణ అధికారాలుంటాయి. రాష్ట్ర యంత్రాంగాన్ని తమ పరిధిలోకి తీసుకుని నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించడం దాని విధి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం.. ప్రభుత్వ యంత్రాంగమే తమ పరిధిలో ఉంటుందనే విషయాన్ని విస్మరించి, తామూ వైకాపా ప్రభుత్వంలో ఒక భాగం అన్నట్లుగా పనిచేస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. షెడ్యూలు వెలువడిన నాటి నుంచీ అడుగడుగునా మెతకవైఖరే. ఎన్నికల నిర్వహణలో భాగంగా తన అధికారాలను పూర్తిస్థాయిలో వినియోగించాలనే ఆలోచనే చేయడం లేదు. తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు.. తప్పనిసరి పరిస్థితుల్లోనే చర్యలు తీసుకుంటోంది. పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనే ఎన్నికల సంఘం పనితీరుకు నిలువెత్తు నిదర్శనం. మాచర్ల నియోజకవర్గంలో ఏడు చోట్ల ఈవీఎం ధ్వంసం ఘటనలు జరిగితే ఏ అధికారీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించలేదు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చడానికి 8 రోజులు పట్టింది.

ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వీడియో నిజమేనా అని కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసేవరకూ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించలేదు. బాధ్యులైన ఉన్నతాధికారులపైనా చర్యల్లేవు. ఇప్పటికీ ఈవీఎంల ధ్వంసం ఘటనలను తేలిగ్గా చెబుతూ, పది ఘటనల్లో పిన్నెల్లి చేసిందొకటి అన్నట్లుగా మాట్లాడుతున్నారంటేనే.. అధికారపార్టీ నేతలపై ఎన్నికల సంఘం అధికారులు ఎంత ఆపేక్ష చూపిస్తున్నారో అర్థమవుతోంది. ఈ వీడియో బయటకు ఎలా వచ్చిందని వైకాపా వేస్తున్న ప్రశ్నలకు ఉలిక్కిపడుతున్న సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా.. ఆ వీడియో తాము విడుదల చేయలేదంటూ సర్దిచెప్పుకొనేందుకు ప్రయత్నిస్తుండటం శోచనీయం. అధికారపార్టీ వారిపై ఏ చర్య తీసుకుంటే ఏమవుతుందో అనే భయమే ఎన్నికల సంఘం అధికారుల్ని వెన్నాడుతున్నట్లు కనిపిస్తోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. అందుకే ప్రతి అంశంపైనా దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందించాల్సి వస్తోందని చెబుతున్నాయి. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఎన్నికల సంఘం ఇలాగే చేతులు కట్టుకుని కూర్చుంటే.. అధికార వైకాపా మరెన్నో అక్రమాలకు తెగబడుతుందనే ఆందోళన ప్రతిపక్షాల్లో వ్యక్తమవుతోంది.

సిట్‌ లేకుంటే బయటపడే ప్రశ్నే లేదు!

పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలోకి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రవేశించి ఈవీఎం ధ్వంసం చేసినా.. గుర్తుతెలియని వ్యక్తులు చేశారనే కేసు నమోదైంది. ఎమ్మెల్యేకు భయపడిన అక్కడి అధికారులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో వీఆర్వో ద్వారా పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. పోలింగ్‌ అనంతర హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం సిట్‌ ఏర్పాటుచేశాకే.. ఈవీఎం ధ్వంసం చేసింది ఎమ్మెల్యే పిన్నెల్లి అనే విషయం వెబ్‌కాస్టింగ్‌ పరిశీలనలో బయటపడింది. అంటే సిట్‌ ఏర్పాటుకాకుంటే గుర్తుతెలియని వ్యక్తులు చేశారనే కేసునే కొనసాగించేవారు. ఎమ్మెల్యే వీడియో కూడా బయటకొచ్చేది కాదు. కేసు తర్వాత కూడా ఈవీఎం ధ్వంసం వీడియో బయటపెట్టకుండా.. పోలీసులు, ఎన్నికల అధికారులు పిన్నెల్లికి జీ హుజూర్‌ అన్నారు.  

ఈవీఎం ధ్వంసమైతే ఎవరు చేశారో ఆరా తీయలేదా?

ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగితేనే ఎవరు వారనే ప్రశ్న వస్తుంది. పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసమైనప్పుడు ఈ ఘటనకు పాల్పడిందెవరనే ప్రశ్న ఎన్నికల సంఘానికి ఎందుకు రాలేదు? అందులోనూ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ధ్వంసం చేస్తే ఎందుకు పట్టించుకోలేదు? పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసమైన సంగతి తెలిశాక.. కొత్త యూనిట్‌తో పోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించినట్లు సీఈఓ మీనా చెబుతున్నారు. అప్పుడే ఈవీఎం ఎందుకు ధ్వంసమైంది, ఎవరు చేశారని ఆయన ఎందుకు ఆరాతీయలేదు? కనీసం పీఓ, ఏపీఓ నివేదికలేంటో తెలుసుకోకుండా నిర్లక్ష్యం వహించారు. వీడియో ఫుటేజిని పోలీసులకు ఇవ్వడంతోనే.. తమ పని అయిపోయిందంటూ ఆర్వో సహా ఎన్నికల సంఘం చేతులు కట్టేసుకునే ప్రయత్నం చేసిందని ప్రజాసంఘాల నేతలు పేర్కొంటున్నారు.


పీఓ, ఏపీఓ మాత్రమే బాధ్యులా? 

పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలోకి ఎమ్మెల్యే పిన్నెల్లి వస్తుండగా అక్కడి అధికారులంతా లేచి నిల్చుని మరీ ఆయనకు సలాం కొట్టారు. ఈవీఎం ధ్వంసంతో వారు మరింత వణికిపోయారు. భయంతో ఫిర్యాదు చేసేందుకు రాలేదు. కీలక అధికారులంతా ఎవరికి వారే ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తున్నట్లు వ్యవహరిస్తుంటే పీఓ, ఏపీఓ మాత్రం ఏం చేయగలరు? వారికి నైతిక ధైర్యం కల్పించి ఫిర్యాదు చేసేలా చూడాల్సిన బాధ్యతను మరిచిపోయిన ఉన్నతాధికారులు.. వారిద్దరినీ బాధ్యులను చేస్తూ చేతులు దులిపేసుకున్నారు. పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఏం జరిగిందో వెబ్‌కాస్టింగ్‌లో చూసే ఆర్‌ఓ శ్యామ్‌ప్రసాద్, జిల్లా ఎన్నికల అధికారి, సీఈఓ సహా అందరికీ కనిపిస్తుంది. ఆ క్షణంలో చూడకపోయినా.. ఈవీఎం ధ్వంసమైందని పోలింగ్‌ కేంద్ర సిబ్బంది నుంచి ఫిర్యాదు అందిన తర్వాతైనా చూసే ఉంటారు. మళ్లీ పోలింగ్‌ కొనసాగించేందుకు అనుమతించే సమయంలో అయినా తప్పనిసరిగా వెబ్‌కాస్టింగ్‌ చూసే ఉంటారు. కనీసం అప్పుడైనా ఈవీఎం ధ్వంసం చేసింది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డే అని స్పష్టంగా తెలుస్తుంది. అయినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదంటే కారణమేంటి? ఆర్‌ఓ శ్యామ్‌ప్రసాద్‌ ఏం చేశారు? సీఈఓ మీనా ఎందుకు కఠినంగా వ్యవహరించలేకపోయారు? దీనికి బాధ్యులెవరు? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని