Pinnelli: హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని అరెస్ట్‌ చేయరా?

మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన హత్యాయత్నం కేసుల్లో పోలీసులు ఆయనను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు? కారంపూడి సీఐపై దాడి చేసి గాయపరిచినా ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయకుండా అసాధారణ సంయమనం ఎందుకు పాటిస్తున్నారు?

Updated : 25 May 2024 07:18 IST

సీఐపై దాడి చేసినా చీమకుట్టినట్టు లేదా?
పోలీసులది స్వామిభక్తా.. చేవలేనితనమా?

ఈనాడు, అమరావతి: మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన హత్యాయత్నం కేసుల్లో పోలీసులు ఆయనను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు? కారంపూడి సీఐపై దాడి చేసి గాయపరిచినా ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయకుండా అసాధారణ సంయమనం ఎందుకు పాటిస్తున్నారు? ఇది పోలీసుల చేతగానితనమా లేక వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డితో వ్యవహరిస్తున్నట్టుగా ఎక్కడ లేని భక్తిప్రపత్తులు ప్రదర్శిస్తున్నారా? పాల్వాయిగేటు పోలింగ్‌స్టేషన్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాత్రమే పిన్నెల్లిని వచ్చే నెల 6 వరకు అరెస్ట్‌ చేయవద్దని హైకోర్టు చెప్పింది. హత్యాయత్నం నేరం కింద ఐపీసీ సెక్షన్‌ 307 కింద ఎమ్మెల్యేను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ దాఖలైన కేసుల్లో ఆయన్ను అరెస్ట్‌ చేయవద్దని చెప్పలేదు. మరి అంత తీవ్ర నేరానికి సంబంధించిన కేసుల్లో పిన్నెల్లిని అరెస్ట్‌ చేయకుండా పోలీసుల్ని ఆపుతోంది ఎవరు? ఈవీఎం ధ్వంసం కేసులో కూడా సంబంధిత వీడియో బయటకు వచ్చి, ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేశాకే ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు కదిలారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కారును వెంబడించామని, ఆయన తప్పించుకు పారిపోయారని హైడ్రామా పండించారు. ఈవీఎం ధ్వంసం కేసులో ఆరో తేదీ వరకు ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయవద్దని కోర్టు చెప్పడంతో పోలీసులు.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని, రిలాక్సై పోయారా? ఈవీఎం ధ్వంసం కంటే హత్యాయత్నం తీవ్రమైన నేరమైనప్పుడు ఆయన్ను వెంటనే ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు? ఎమ్మెల్యేపై సెక్షన్‌ 307 కింద రెండు కేసులు నమోదైనా అరెస్ట్‌ చేయకుండా పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి.

మరీ అంత ప్రభు భక్తా? 

రాష్ట్రంలో డీజీపీ మారినా అధికార పార్టీ నాయకులపై పోలీసుల ప్రభుభక్తిలో ఎలాంటి మార్పూ రాలేదనడానికి పిన్నెల్లి ఉదంతమే నిదర్శనం. పోలింగ్‌ సందర్భంగా... రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి   పాల్పడ్డారు. దానిపై రెంటచింతల పోలీసులు ఎమ్మెల్యేతోపాటు మరో 15 మందిపై సెక్షన్‌ 307, 147, 148, 120బీ, 324, రెడ్‌విత్‌ 149 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. రామకృష్ణారెడ్డిని ఏ-1గా పెట్టారు. పోలింగ్‌ మరుసటిరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అలజడి సృష్టించారు. అడ్డుకోబోయిన సీఐ నారాయణస్వామిపై దాడి చేసి, గాయపరిచారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు, మరికొందరిపై ఐపీసీ 307, 332, 143, 147, 324, 149 సెక్షన్ల కింద కింద ఈ నెల 14వ తేదీ రాత్రి కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఒక సీఐని దారుణంగా కొట్టి గాయపరిచినా కూడా ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయకుండా పోలీసులు మీనమేషాలు లెక్కించడం సిగ్గుచేటు!

ఇంత కంటే అరాచకం ఏముంటుంది?

‘పోలింగ్‌ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో బూత్‌లోకి అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే ఈవీఎం పగలగొట్టారు. నేను అడ్డుకోబోతే వేలు చూపించి బెదిరిస్తూ ఈ నా కొడుకును చంపెయ్యండ్రా అంటూ హుంకరించారు. ఎమ్మెల్యే అనుచరులు చింతా సుబ్బారావు, మరికొందరు కర్రలు, రాడ్లతో, కత్తులతో నాపై దాడిచేశారు. తీవ్రంగా గాయపడ్డ నేను అక్కడే కిందపడిపోయాను. చచ్చాడు లేరా అంటూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు వెళ్లిపోయారు. అనంతరం బంధువుల సాయంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాను’ అని నంబూరి శేషగిరిరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంత పక్కాగా ఆధారాలు, ఫిర్యాదులున్నా పోలీసులు ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు? ప్రజాప్రతినిధినని మర్చిపోయి ఒక రౌడీలా వ్యవహరించిన ఆయనపై పోలీసులకు ఎందుకంత మమకారం? పాల్వాయిగేటులో ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసి బయటకు వస్తున్న సమయంలో చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ నిలదీయగా ఆమెను తీవ్రంగా హెచ్చరిస్తూ దుర్భాషలాడారు. దీనిపై ఆ మహిళ ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసులా? పిన్నెల్లికి వేగులా?

పల్నాడు జిల్లాలోని పోలీసుల్లో అత్యధికులు వైకాపా నాయకులకు వేగుల్లా పనిచేస్తున్నారని ఇటీవల ఒక పోలీసు ఉన్నతాధికారి వాపోయారు. పిన్నెల్లి కోసం గాలిస్తున్న పోలీసు బృందాల్లోని కొందరు వారి కదలికల్ని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేకు చేరవేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం నుంచి పోలీసు బృందాలు బయల్దేరగానే ఆ సమాచారం పిన్నెల్లికి చేరిపోయిందని, ఈ బృందాలకు సారథ్యం వహిస్తున్న అధికారికి సభ్యులు ఏ మాత్రం సహకరించడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. పిన్నెల్లి ఈ నెల 22న హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ పారిపోయేందుకు విమాన టిక్కెట్‌ కొన్నారు. ఆ విషయాన్ని పిన్నెల్లిని అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన బృందాలకు పల్నాడు జిల్లా నుంచి ఒక పోలీసు అధికారి ఫోన్‌ చేసి చెప్పారు. వెంటనే ఈ విషయం పిన్నెల్లికి చేరిపోవడంతో ఆయన విమానాశ్రయానికి వెళ్లలేదని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు