iPhone tariff: ఆ ఐఫోన్లకు 25% సుంకం

Eenadu icon
By Business News Desk Published : 24 May 2025 02:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

అమెరికాలో తయారు చేయని వాటికి వర్తింపు
ఈయూపైనా 50% టారిఫ్‌  
సామాజిక మాధ్యమాల్లో అమెరికా అధ్యక్షుడు పోస్టులు

అమెరికాలో ఐఫోన్‌ ఉత్పత్తి చేస్తే: యాపిల్‌ సంస్థ ఐఫోన్లను అమెరికాలోనే ఉత్పత్తి చేస్తే, ప్రస్తుతం 1200 డాలర్లుగా ఉన్న ఐఫోన్‌ ధర 1500-2000 డాలర్ల వరకు చేరొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి టెక్‌ పరికరాల అగ్రగామి సంస్థ యాపిల్‌పై విరుచుకుపడ్డారు. అమెరికాలో ఐఫోన్లు తయారు చేయని పక్షంలో, యాపిల్‌ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తానని సామాజిక మాధ్యమాల్లో ట్రంప్‌ హెచ్చరించారు. ‘యాపిల్‌ అధిపతి టిమ్‌కుక్‌కు నేను ఎపుడో చెప్పా. అమెరికాలో విక్రయమయ్యే ఐఫోన్లన్నీ అమెరికాలోనే తయారు కావాలి. భారత్‌లోనో ఇంకో దేశంలోనో కాదు. ఒక వేళ అమెరికాలో తయారీకి సిద్ధం కాకుంటే, దిగుమతి చేసుకునే ఫోన్లపై యాపిల్‌ కనీసం 25% సుంకం చెల్లించాల్సి ఉంటుంద’ని ట్రంప్‌ స్పష్టం చేశారు. చైనాపై భారీ టారిఫ్‌ విధించిన నేపథ్యంలో, ఐఫోన్‌ తయారీని భారత్‌లో భారీగా చేపట్టేందుకు టిమ్‌కుక్‌ సన్నాహాలు చేస్తున్నారు. అమెరికాలో విక్రయం కానున్న ఐఫోన్లలో మెజారిటీ భాగాన్ని భారత్‌లో తయారు చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల కంపెనీ వెల్లడించింది. అమెరికాలో అమ్ముడయ్యే ఐప్యాడ్, మ్యాక్, యాపిల్‌ వాచ్, ఎయిర్‌పాడ్‌లు వియత్నాంలో తయారు చేసినవే ఉంటాయని వివరించింది. అమెరికా వెలుపల తమ ఉత్పత్తుల మొత్తం విక్రయాల్లో, అధిక భాగం చైనాలో తయారు చేసినవే ఉంటాయనీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ట్రంప్‌ తాజా హెచ్చరికలు చేశారు. 

జూన్‌ 1 నుంచే అమలు

ప్పటి నుంచో అమెరికాకు సన్నిహితంగా ఉన్న ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి, చైనాకు మించి  టారిఫ్‌ వసూలు చేయాలని ట్రంప్‌ భావిస్తున్నారు. చర్చల అనంతరం చైనాపై టారిఫ్‌ను 30 శాతానికి సవరించిన ట్రంప్‌..  ఈయూతో వాణిజ్య చర్చల్లో పెద్దగా ప్రగతి కనిపించకపోవడంతో విసుగెత్తారు. అమెరికాలోకి వచ్చే చాలా వరకు దిగుమతులపై 10 శాతం ప్రాథమిక సుంకాన్ని ఉంచుతామని   ట్రంప్‌ ప్రకటిస్తున్నారు. ఈయూ మాత్రం టారిఫ్‌ను సున్నాకు తగ్గించాలని కోరుతోంది. ‘మా చర్చలు ముందుకు జరగడం లేదు. అందుకే ఈయూపై జూన్‌ 1 నుంచి 50% టారిఫ్‌ విధిస్తున్నా. అమెరికాలో తయారైన ఉత్పత్తులపై మాత్రం ఎటువంటి టారిఫ్‌ ఉండదు’ అని తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ట్రంప్‌ పోస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు