Piyush Goyal: వినియోగదార్లకు జీఎస్‌టీ ప్రయోజనాలు.. పరిశ్రమకు పీయూశ్‌ గోయల్‌ సూచన

Eenadu icon
By Business News Desk Published : 05 Sep 2025 06:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

దిల్లీ: జీఎస్‌టీ రేట్ల మార్పు వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలను వినియోగదార్లకు కచ్చితంగా బదలాయించాలని పరిశ్రమకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి మంత్రి పీయూశ్‌ గోయల్‌ సూచించారు. స్వాతంత్య్రం వచ్చాక.. అతిపెద్ద సంస్కరణ ఇదేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జీఎస్‌టీ సంస్కరణల వల్ల దాదాపు అన్ని రంగాల్లోనూ గిరాకీ పెరుగుతుందని, తద్వారా ఆర్థిక వృద్ధికి మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. గురువారమిక్కడ జరిగిన మెడ్‌టెక్‌ ఎక్స్‌పో, ఐఫెక్స్‌ 2025, భారత్‌ న్యూట్రావర్స్‌ ఎక్స్‌పో 2025లో ఆయన మాట్లాడారు. ‘వచ్చే రెండేళ్లలో భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. 2047 కల్లా ప్రస్తుత 4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుంచి 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుంది. జీఎస్‌టీ సంస్కరణలతో రైతు నుంచి ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల వరకు పలు రంగాలపై ప్రభావం కనిపిస్తుంది. దేశంలోని ప్రతీ వినియోగదారుకు లబ్ది చేకూరుతుంది. 140 కోట్ల మంది పౌరులకు నాణ్యమైన జీవితాన్ని ఈ దీపావళి కానుక ఇస్తుంద’న్నారు. 

మేం బదిలీ చేస్తాం: దాదాపు ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలన్నీ వినియోగదార్లకు ప్రయోజనాన్ని బదిలీ చేస్తామని చెప్పాయి. మదర్‌డెయిరీ కూడా తమ అన్ని ఉత్పత్తులపై జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాలను బదిలీ చేస్తామని తెలిపింది. తోలు ఉత్పత్తులపై పన్ను రేటును 12% నుంచి 5 శాతానికి తగ్గించిన నేపథ్యంలో, రూ.1,000లోపు ఉత్పత్తులపై ఈ ప్రయోజనాన్ని గడువుకన్నా ముందే వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు బాటా తెలిపింది. 

22 దాకా కొనుగోళ్లు ఆపాలా?: సబ్బుల నుంచి చిన్న కార్ల వరకు సుంకాలు తగ్గిన నేపథ్యంలో.. కారు కానీ టీవీ కానీ కొనాలంటే ఈ నెల 22 వరకూ ఆగాలా? అన్న అనుమానం రావొచ్చు. దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారంటే.. ‘చట్టప్రకారం.. 22 నుంచే ఇన్‌వాయిస్‌లలో సవరించిన జీఎస్‌టీ రేటు కనిపిస్తుంది. ఆ తేదీ తర్వాత పంపిణీదార్ల వద్ద ఏదైనా పెండింగ్‌లో ఉన్నా కూడా రిటైలర్లు మాత్రం పాత రేటును ఛార్జీ చేయలేరు. అయితే వినియోగదార్లు, తగ్గిన రేట్లను పరిశీలించుకుంటే మంచిద’ని చెబుతున్నారు. 21 వరకూ ప్రస్తుత రేట్లు ఉంటాయి కాబట్టి.. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. 

జీఎస్‌టీ సాఫ్ట్‌వేర్‌ నవీకరణపై పరిశ్రమ రంగాలతో సమన్వయం: సీబీఐసీ

దిల్లీ: జీఎస్‌టీ రేట్లలో మార్పులను ఈ నెల 22 నుంచి అమల్లోకి తెచ్చే ప్రక్రియ సాఫీగా జరిగేందుకు, సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌పై పరిశ్రమలతో సమన్వయం చేసుకోవడంపై జీఎస్‌టీ విభాగం దృష్టి పెట్టింది. పన్ను రేట్లు తగ్గిన వస్తువులకు సంబంధించి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను వినియోగించుకునే విషయంలో పరిశ్రమ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) ఛైర్మన్‌ సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ తెలిపారు. క్లెయిమ్‌ చేసుకున్న క్రెడిట్‌ను పన్నుల చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. జీఎస్‌టీ విధానంలో 4 శ్లాబులకు బదులు రెండు శ్లాబులనే కొనసాగిస్తూ జీఎస్‌టీ మండలి 56వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ‘పన్ను రేట్లలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా 40% జీఎస్‌టీ రేటును ప్రవేశపెట్టారు. ఇవి అమల్లోకి తేవడానికి సుమారు రెండు వారాల సమయమే ఉంది. అయినా ఈ ప్రక్రియ సాఫీగా జరిగేలా చూసేందుకు మేం పూర్తి సన్నద్ధతతో ఉన్నామ’ని  అగర్వాల్‌ వెల్లడించారు. పరిశ్రమ రంగాలతో ఇప్పటికే జీఎస్‌టీ విభాగం సంప్రదింపులు జరిపిందని, వాళ్లు కూడా తమ సాఫ్ట్‌వేర్‌లను అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ‘జీఎస్‌టీ రేట్లలో మార్పులకు తగ్గట్లుగా పరిశ్రమ కూడా వాళ్ల సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే జీఎస్‌టీ రేట్ల కోత అమలు ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. ఎలాంటి సాంకేతిక సమస్యలూ తలెత్తవు. ఈ విషయంలో మేం పూర్తి విశ్వాసంతో ఉన్నామ’ని అగర్వాల్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని