Hyderabad: క్షిపణులు.. డ్రోన్లు.. నావిగేషన్‌ సిస్టమ్స్‌

Eenadu icon
By Business News Desk Published : 01 Nov 2025 01:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

రక్షణ ఉత్పత్తుల కంపెనీలకు జోరుగా ఆర్డర్లు
హైదరాబాద్‌లో విస్తరిస్తున్న పరిశ్రమలు
ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌ కేంద్రంగా రక్షణ ఉత్పత్తుల రంగం వేగంగా విస్తరిస్తోంది. ఈ విభాగంలో ఇప్పటికే పలు కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తుండగా, కొత్తగా మరిన్ని ఏర్పాటవుతున్నాయి. క్షిపణులు, డ్రోన్లు, నావిగేషన్‌ సిస్టమ్స్, ట్రైనింగ్‌ సిస్టమ్స్, విడిభాగాలను ఈ కంపెనీలు అందిస్తున్నాయి. రక్షణ ఉత్పత్తుల కోసం ఎన్నో ఏళ్లుగా  ఇజ్రాయెల్, ఫ్రాన్స్, రష్యా, అమెరికాపై ఆధారపడిన మనదేశం.. ఆయా దేశాల కంపెనీల నుంచి ఆయుధాలు, ఆయుధ సామగ్రి, యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తూ వచ్చింది. దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలు రూపొందించి, కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించిన ఫలితంగా నాలుగైదేళ్లుగా మార్పు వేగవంతమైంది. ఈ క్రమంలోనే స్థానిక కంపెనీలకు రక్షణ శాఖ, రక్షణ సంస్థల నుంచి ఆర్డర్లు లభిస్తున్నాయి.

ఈ కంపెనీలకు..: రక్షణ శాఖకు చెందిన డీఆర్‌డీఓ (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) విభాగాలు హైదరాబాద్‌లో పెద్దఎత్తున విస్తరించి ఉన్నాయి. అదనంగా బీడీఎల్‌ (భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌), మిధాని, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ రంగ రక్షణ ఉత్పత్తుల సంస్థలే. ఈ సంస్థల మద్దతుతో ప్రైవేటు రంగంలో ఎన్నో సంస్థలు స్థానికంగా ఏర్పాటయ్యాయి. ఇవి నెమ్మదిగా విస్తరించి, ఇప్పుడు అభివృద్ధి పరుగు అందుకుంటున్నాయి. ఇందులో కొన్ని కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కాగా, మరికొన్ని ప్రైవేటు సంస్థలుగానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇక్కడ కొలువు దీరిన జెన్‌ టెక్నాలజీస్, అవాంటెల్, అస్త్ర మైక్రోవేవ్, అపోలో మైక్రో సిస్టమ్స్‌.. తదితర కంపెనీలకూ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. ట్రైనింగ్‌ సిస్టమ్స్, యాంటీ-డ్రోన్‌ సిస్టమ్స్‌ అందించే జెన్‌ టెక్నాలజీస్‌కు రక్షణ శాఖ నుంచి తాజాగా రూ.289 కోట్ల ఆర్డర్‌ లభించింది. డ్రోన్‌ టెక్నాలజీ ఆధునికీకరణకు వచ్చిన ఈ ఆర్డర్‌ను, ఏడాది కాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అస్త్ర మైక్రోవేవ్‌కు రూ.285.56 కోట్ల ఆర్డర్‌ లభించింది. భారత వాయుసేనలోని స్పెషల్‌ ఫోర్సెస్‌ అవసరాలకు అనుగుణంగా కమ్యూనికేషన్‌ సిస్టమ్స్, విడిభాగాలను 11 నెలల వ్యవధిలో ఈ సంస్థ సరఫరా చేయాలి. అవాంటెల్‌ సిస్టమ్స్‌కు ఇటీవల పలు చిన్న, మధ్యస్థాయి ఆర్డర్లు లభించాయి. కొన్ని పెద్ద ఆర్డర్ల కోసం ఈ సంస్థ ఎదురు చూస్తున్నట్లు మార్కెట్‌ వర్గాల్లో ప్రచారంలో ఉంది. స్టాక్‌మార్కెట్లో నమోదు కాని, చిన్న- మధ్యస్థాయి రక్షణ ఉత్పత్తుల సంస్థలు సైతం ఆకర్షణీయ ఆర్డర్లు సంపాదిస్తున్నాయి. దీనివల్ల కొత్తగా ఉద్యోగాల కల్పన సాధ్యమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు