యూఎస్‌తో వాణిజ్య ఒప్పందంపై మాట్లాడుతున్నాం

Eenadu icon
By Business News Desk Published : 30 Aug 2025 02:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌

దిల్లీ: అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్‌ చర్చలు జరుపుతున్నట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్‌ గోయల్‌ పేర్కొన్నారు. భారత వస్తువులపై అమెరికా విధించిన 50% టారిఫ్‌ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం ఉండదని అన్నారు. ‘ఎవరైనా ఒక మంచి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కావాలనుకుంటే.. మేం ఎపుడూ సిద్ధమే. అంతే తప్ప వివక్షచూపితే ఎప్పటికీ తల వంచం. ఎప్పటికీ బలహీనపడం. మనమంతా కలిసే ముందుకు వెళదాం’ అని పరిశ్రమతో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. 

ఎగుమతులకు ఊతమిచ్చేలా త్వరలో చర్యలు: ఎగుమతులు, దేశీయ వినియోగానికి ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం త్వరలోనే చర్యలను చేపడుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఇతర దేశాలు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో పడే ప్రతికూల ప్రభావం నుంచి దేశీయ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆగస్టు 27 నుంచి భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం సుంకాల విధింపు అమల్లోకి రావడంతో గోయల్‌ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కార్మిక ఆధారిత రంగాలైన రొయ్యలు, రసాయనాలు, తోలు, పాదరక్షల ఎగుమతులపై ఈ సుంకాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని ఎగుమతిదార్లు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఎగుమతిదార్లకు గోయల్‌ హామీ ఇచ్చారు. సుంకాల ప్రభావం ఏయే రంగాలపై పడొచ్చు? ప్రత్యామ్యాయ విపణులేమిటి? అనే వివరాలను ప్రభుత్వం దృష్టికి తేవాల్సిందిగా పరిశ్రమను ఆయన కోరారు. ‘ఇతర ప్రత్యామ్నాయ విపుణుల్లో ఉన్న అవకాశాలను వాణిజ్య శాఖాపరంగా మాకున్న మార్గాల ద్వారా తెలుసుకుంటున్నాం. దేశీయంగా వినియోగం పెంచడం పైనా దృష్టి సారిస్తున్నామ’ని గోయల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు