టాటా ట్రస్ట్స్‌లో భగ్గుమన్న విభేదాలు

Eenadu icon
By Business News Desk Published : 29 Oct 2025 02:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మెహ్లీ మిస్త్రీ పునః నియామకానికి ముగ్గురు ట్రస్టీలు ససేమిరా

దిల్లీ: టాటా ట్రస్ట్స్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. రతన్‌ టాటాకు దగ్గరి వ్యక్తి, వ్యాపారవేత్త అయిన మెహ్లీ మిస్త్రీని ట్రస్టీగా మరోసారి నియమించేందుకు టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ నోయల్‌ టాటా, మరో ఇద్దరు శక్తిమంత ట్రస్టీలు ససేమిరా అన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతేడాది రతన్‌ టాటా మృతి అనంతరం టాటా ట్రస్ట్స్‌ అధిపతిగా నోయల్‌ టాటా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

ఎవరు వద్దన్నారంటే: మిస్త్రీ పునః నియామకానికి వ్యతిరేకంగా టీవీఎస్‌ మోటార్‌ గౌరవ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి విజయ్‌ సింగ్‌ ఓటు వేశారు. మిస్త్రీ మూడేళ్ల పదవీ కాలం మంగళవారం ముగియనున్న నేపథ్యంలో ఈ ఓటింగ్‌ జరిగినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. 

వీరి మద్దతు: మిస్త్రీకి సన్నిహితులైన సిటీ బ్యాంక్‌ ఇండియా మాజీ సీఈఓ ప్రమీత్‌ ఝవేరి, ముంబయి న్యాయవాది డేరిస్‌ ఖంబత, పుణెకు చెందిన దాతృత్వశీలి జహంగీర్‌ హెచ్‌సీ జహంగీర్‌ మాత్రం పునః నియామకానికి మద్దతు పలికినట్లు ఆ వర్గాలు చెప్పారు. ఏకగ్రీవంగా ట్రస్టీల నియామకం జరగాలన్న ఇటీవలి టాటా ట్రస్ట్స్‌ ధోరణికి భిన్నంగా ఇది జరగడం గమనార్హం. 

సెప్టెంబరులో చీలిక: టాటా ట్రస్ట్స్‌ నోయల్, మిస్త్రీ వర్గాలుగా విడిపోయినట్లు సెప్టెంబరులో బయటకు వచ్చింది. టాటా ట్రస్ట్స్‌ ప్రతినిధిగా టాటా సన్స్‌ బోర్డులో ఉన్న సింగ్‌ను తొలగించడానికి మిస్త్రీతో పాటు ఆయన వర్గం(ఝవేరి, ఖంబత, జహంగీర్‌) ఓటు వేయడంతో తొలిసారిగా పొరపొచ్ఛాలు బయటకు కనిపించాయి. అయితే గతవారం వేణుశ్రీనివాసన్‌ను జీవిత కాల ట్రస్టీగా నియమించాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు.

ఇపుడేం చేస్తారు: మిస్త్రీ తదుపరి తీసుకునే నిర్ణయంపై ఎటువంటి సంకేతాలు ఇవ్వడం లేదని సమాచారం. కోర్టులో ఆయన ఈ అంశాన్ని సవాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఎందుకింత ప్రాధాన్యత: సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌లతో పాటు పలు ఛారిటబుల్‌ ట్రస్టులకు గొడుగు సంస్థగా టాటా ట్రస్ట్స్‌ ఉంది. టాటా సన్స్‌లో 66% వాటా దీని సొంతం. 156 ఏళ్ల టాటా గ్రూప్‌నకు హోల్డింగ్‌ సంస్థగా ఉంది. టాటా గ్రూప్‌లో 400కు పైగా కంపెనీలుండగా.. అందులో 30 నమోదిత కంపెనీలే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు