అనిల్‌ అంబానీ కంపెనీల వల్ల యెస్‌ బ్యాంక్‌కు రూ.2,700 కోట్ల నష్టం

Eenadu icon
By Business News Desk Published : 30 Oct 2025 02:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సీబీఐ ఛార్జ్‌షీట్‌లో వెల్లడి

ముంబయి: అనిల్‌ అంబానీకి చెందిన ఆర్థిక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని యెస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ తీసుకున్న ‘ఏకపక్ష’ నిర్ణయం కారణంగా బ్యాంక్‌కు రూ.2,700 కోట్లకు పైగా నష్టం వచ్చిందని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. యెస్‌ బ్యాంక్, అనిల్‌ అంబానీ గ్రూప్‌ సంస్థల మధ్య మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన కేసు ఛార్జ్‌షీట్‌లో ఈ అంశాలను వెల్లడించింది. రుణాలు, పెట్టుబడులకు సంబంధించిన నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ సీబీఐ గత నెలలో అనిల్‌ అంబానీ, రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులతో సహా 13 మంది వ్యక్తులు, సంస్థలపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో అనిల్‌ అంబానీ కుమారుడు, అప్పటి రిలయన్స్‌ క్యాపిటల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్మోల్‌ అంబానీ పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందని సీబీఐ తెలిపింది. యెస్‌ బ్యాంక్‌ చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి దాఖలు చేసిన రెండు వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసు నమోదైంది. సీబీఐ ఛార్జ్‌షీట్‌ ప్రకారం.. యెస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా రాణా కపూర్‌ ఉన్నప్పుడు, 2017-19 మధ్య అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ (ఏడీఏ) గ్రూప్‌నకు చెందిన ఆర్థిక కంపెనీల్లో రూ.5010 కోట్ల పెట్టుబడులను బ్యాంక్‌ పెట్టింది. ఈ పెట్టుబడులతో లభించిన షేర్ల విలువలు పడిపోవడంతో, ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంక్‌ పొందలేకపోయింది. ఫలితంగా రూ.2,796.77 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కొన్ని ఏడీఏ సంస్థలు షెల్‌ కంపెనీలుగా గుర్తించినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని