సంక్షిప్తవార్తలు (5)

Eenadu icon
By Business News Desk Published : 02 Nov 2025 02:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

కోల్‌ ఇండియా సీఎండీగా సనోజ్‌ కుమార్‌ ఝా 

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సనోజ్‌ కుమార్‌ ఝా బాధ్యతలు స్వీకరించారు. శనివారం నుంచి మూడు నెలల పాటు లేదా తదుపరి సీఎండీ నియామకం జరిగే వరకు లేదా తదుపరి ఆదేశాల వరకు ఆయన ఈ అదనపు బాధ్యతలు చూస్తారు. కోల్‌ ఇండియా సీఎండీ స్థానంలోని పీఎమ్‌ ప్రసాద్‌ పదవీ విరమణ చేయడంతో, శనివారం ఝా ఈ పగ్గాలు చేపట్టినట్లు బీఎస్‌ఈకిచ్చిన సమాచారంలో కోల్‌ ఇండియా పేర్కొంది. నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ ప్రస్తుత సీఎండీ  బి.సాయిరామ్‌ను కోల్‌ ఇండియా ఛైర్మన్‌ పదవికి సెప్టెంబరులో పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ సెలెక్షన్‌ బోర్డ్‌(పీఈఎస్‌బీ) సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.


రూ.5,817 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఇంకా విపణిలోనే: ఆర్‌బీఐ 

ముంబయి: రూ.5,817 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఇంకా విపణిలోనే ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. 2023 మే 19న వీటిని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించే నాటికి మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వినియోగంలో ఉండేవి. అందులో ఇప్పటివరకు 98.37% నోట్లు ఆర్‌బీఐకి తిరిగి వచ్చాయి. రూ.2,000 నోట్లను తమ ఖాతాలో జమ చేసుకునేందుకు హైదరాబాద్‌ సహా 19 ప్రాంతాల్లోని ఆర్‌బీఐ ఇష్యూ కేంద్రాలకు ఈ నగదును తపాలా కార్యాలయాల ద్వారాకూడా పంపొచ్చు. 


ఆజాద్‌ ఇంజినీరింగ్‌ లాభం రూ.32 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆజాద్‌ ఇంజినీరింగ్‌ రూ.157.8 కోట్ల ఆదాయాన్ని, రూ.32.6 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.113 కోట్లు, నికర లాభం రూ.20.8 కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరులో రూ.303.6 కోట్ల ఆదాయాన్ని, రూ.62.04 కోట్ల నికర లాభాన్ని సంస్థ నమోదు చేసింది.


ఇండియా ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్ఛేంజీలోకి ఎస్‌బీఐ

దిల్లీ: ఇండియా ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్ఛేంజ్‌(ఐఐబీఎక్స్‌)లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చేరింది. ప్రత్యేక విభాగ క్లయింటు(ఎస్‌సీసీ)గా తొలి ట్రేడింగ్‌ను శనివారం చేసినట్లు బ్యాంకు తెలిపింది. ఐఐబీఎక్స్‌ ద్వారా పసిడిని దిగుమతి చేసుకునే ఆభరణదార్లు, బులియన్‌ డీలర్లు, ఇతర వర్గాలకు ఉపకరించేలా సరళతర బులియన్‌ లావాదేవీలను ఒక ప్రత్యేక విభాగ క్లయింటుగా ఎస్‌బీఐ జరుపుతుంది. ఆర్థిక సేవల్లో దిగ్గజంగానే కాకుండా, బులియన్‌ దిగుమతుల గతిని మార్చే ప్రక్రియలోనూ ఎస్‌బీఐ పాలుపంచుకున్నట్లయిందని బ్యాంకు ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి  పేర్కొన్నారు. పసిడి దిగుమతిదార్ల నుంచి వినియోగదార్ల వరకు ఉండే మొత్తం వ్యవస్థకు ఈ పరిణామం ప్రయోజనం కలిగిస్తుందన్నారు. ట్రేడింగ్‌ కమ్‌ క్లియరింగ్‌(టీసీఎమ్‌) మెంబర్‌గా మారిన తొలి బ్యాంకు కూడా ఎస్‌బీఐనే అని తెలిపారు. 


మహీంద్రా 7 సీట్ల ఇ-ఎస్‌యూవీ.. ఎక్స్‌ఈవీ 9ఎస్‌  

ముంబయి: మహీంద్రా గ్రూప్‌ 7 సీట్లు గల విద్యుత్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనానికి  (ఎస్‌యూవీ) ఎక్స్‌ఈవీ 9ఎస్‌ పేరు పెట్టినట్లు ప్రకటించింది. ఆధునాతన ఇంగ్లో ప్లాట్‌ఫామ్‌పై ఈ ఇ-ఎస్‌యూవీని రూపొందించినట్లు తెలిపింది. ఈనెల 27న బెంగళూరులో జరిగే  ‘స్క్రీమ్‌ ఎలక్ట్రిక్‌’ కార్యక్రమంలో మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్‌ను ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు