Rare Earth Magnets: ఆరు నెలల ఉత్కంఠకు తెర

Eenadu icon
By Business News Desk Published : 01 Nov 2025 01:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

చైనా నుంచి అరుదైన భూ అయస్కాంతాలు వస్తున్నాయ్‌
ఈవీ, పునరుత్పాదక, ఎలక్ట్రానిక్స్‌ రంగానికి ఊరట

ఆరు నెలల ఉత్కంఠకు తెరపడింది. మనదేశానికి అరుదైన భూ అయస్కాంతాల (రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్స్‌) ఎగుమతిని  చైనా ప్రారంభించింది. దీంతో విద్యుత్‌ వాహన తయారీదార్లు, పునరుత్పాదక, వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు ఊరట దక్కబోతోంది. అయితే చైనా ఎగుమతులకు కీలక షరతులు విధించినట్లు సమాచారం. అక్కడ నుంచి వచ్చిన ఉత్పత్తులను, ఇక్కడ నుంచి అమెరికా ఎగుమతి చేయకూడదని, మిలటరీ అవసరాలకూ ఉపయోగించకూడదని నిబంధన విధించిందట. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఆ దేశానికి వీటి సరఫరాను చైనా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఏ కంపెనీలకు వస్తాయంటే: చైనా నుంచి భూఅయస్కాంతాలు తెప్పించుకోవడానికి భారత్‌లోని 4 కంపెనీలు అనుమతులు దక్కించుకున్నట్లు ఒక ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. హిటాచీ, కాంటినెంటల్, జే-ఉషిన్, డీఈ డైమండ్స్‌ కంపెనీలు స్థానిక అధికారుల నుంచీ అనుమతులు పొందాక, చైనా నుంచి దిగుమతులు చేసుకోవచ్చు. అమెరికా, చైనా అధ్యక్షుల భేటీ అనంతరం వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన సంకేతాలు కనిపించినా, రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ సరఫరాపై మాత్రం స్పష్టత రాలేదు. 

50 దరఖాస్తులు పెండింగ్‌లో: భారత కంపెనీలు ఇప్పటికే ఎండ్‌ యూజర్‌ సర్టిఫికెట్‌(ఈయూసీ)లను చైనాకు పంపాయి. దాదాపు 50కి పైగా దరఖాస్తులు ఆ దేశ వాణిజ్య శాఖ వద్ద పెండింగ్‌లో ఉండగా, 4 కంపెనీలకు అనుమతులు దక్కినట్లు ఒక సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ సైతం ఆయా కంపెనీలకు అనుమతులు దక్కినట్లు ధ్రువీకరించింది. 

ఎందుకింత ప్రాధాన్యత అంటే: అంతర్జాతీయంగా భూఅయస్కాంతాల ఉత్పత్తిలో చైనా వాటా 90%  పైగా ఉండడం ఒక కారణమైతే, భారత ఈవీ పరిశ్రమ వీటికి అతిపెద్ద వినియోగదారుగా ఉంది. మధ్య, భారీ స్థాయి భూఅస్కాంతాల ఎగుమతులపై చైనా ఏప్రిల్‌ 4న ఆంక్షలు విధించడంతో భారత్‌తో సహా పలు దేశాలపై ప్రభావం పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు