Jio IPO: వచ్చే ఏడాది జియో ఐపీఓ

Eenadu icon
By Business News Desk Published : 30 Aug 2025 03:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

100 కోట్ల తెరలపై జియోస్టార్‌!
కొత్త ఏఐ కంపెనీ ఏర్పాటు
గూగుల్, మెటాతో భాగస్వామ్యం
2026లో బ్యాటరీ గిగాఫ్యాక్టరీ 
ముకేశ్‌ అంబానీ ప్రకటన
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏజీఎమ్‌   

దిల్లీ: అందరూ ఎదురుచూస్తున్న, భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా చెబుతున్న రిలయన్స్‌ జియో పబ్లిక్‌ ఇష్యూ వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే రానుందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) అధిపతి ముకేశ్‌ అంబానీ స్పష్టం చేశారు. ఐపీఓ కోసం జియో అన్ని విధాలా సిద్ధమవుతోందన్నారు. ఇన్వెస్టర్లకు ఇది అత్యంత ఆకర్షణీయ అవకాశంగా ఉండగలదని శుక్రవారం జరిగిన ఆర్‌ఐఎల్‌ వార్షిక సమావేశంలో పేర్కొన్నారు. 2027 కల్లా ఎబిటాను 2022 నాటి రూ.1.25 లక్షల కోట్ల నుంచి రెట్టింపు చేస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రూప్‌నకు సంబంధించిన పలు అంశాలను వాటాదార్లతో పంచుకున్నారు.

రిలయన్స్‌ ఇంటలిజెన్స్‌ వస్తోంది

మెటా, గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఏఐ అనుబంధ సంస్థ ‘రిలయన్స్‌ ఇంటలిజెన్స్‌’ను ఏర్పాటు చేయనున్నట్లు ముకేశ్‌ ప్రకటించారు. ప్రతీ ఒక్కరికీ, ప్రతీ చోటకు ఏఐని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కంపెనీ ఏఐ రెడీ డేటా సెంటర్లను గిగావాట్‌ పరిమాణంలో నిర్మించనుందని తెలిపారు. భారత్‌కు తదుపరి తరం ఏఐ మౌలిక వసతులను, ఏఐ సేవలను, ఏఐ నిపుణులను అందించడమే రిలయన్స్‌ ఇంటలిజెన్స్‌ లక్ష్యాలని స్పష్టం చేశారు.

ఆర్‌ఐఎల్, మెటా కలిసి రూ.855 కోట్ల ప్రాథమిక పెట్టుబడులతో ఒక ఏఐ సంయుక్త సంస్థ(70:30)ను ఏర్పాటు చేయనున్నారు. ఏఐ రెడీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి గూగుల్‌తోనూ ఆర్‌ఐఎల్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది.


10 శాతం వాటా విక్రయం

50 కోట్లకు పైగా వినియోగదారులున్న జియోలో ఎంత మేర వాటా విక్రయం ఉంటుందన్నదనీ ముకేశ్‌ వెల్లడించనప్పటికీ 10% వాటా అమ్మవచ్చన్న వార్తలున్నాయి. ఆర్‌ఐఎల్‌కు ప్రస్తుతం జియోప్లాట్‌ఫామ్స్‌లో 66.3% వాటా ఉండగా, ఫేస్‌బుక్‌కు 10%, గూగుల్‌కు 7.7% వాటాలున్నాయి. జియో విలువ 136-154 బి. డాలర్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐపీఓకు వచ్చాక ప్రపంచంలోనే అతిపెద్ద ఆరో టెలికాం కంపెనీగా మారే అవకాశం ఉంది. 2019లో తొలిసారిగా జియో ఐపీఓ గురించి ముకేశ్‌ ప్రస్తావించారు. 2030 కల్లా 5జీ నుంచి 6జీకి వినియోగదార్లను తీసుకెళతామన్నారు.


2032 కల్లా 3 మి.టన్నుల హరిత హైడ్రోజన్‌

స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో కంపెనీ దూకుడుగా వ్యవహరించనుంది. 2026లో ఒక మెగా బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఏటా 40 జీడబ్ల్యూహెచ్‌ సామర్థ్యం నుంచి 100 జీడబ్ల్యూహెచ్‌కు విస్తరిస్తామని ముకేశ్‌ అన్నారు. వచ్చే ఏడాది చివరకు ఒక ఎలక్ట్రోలైజర్‌ గిగా ఫ్యాక్టరీ కార్యకలాపాలూ ప్రారంభమవుతాయన్నారు. సింగపూర్‌ పరిమణంతో పోలిస్తే మూడింతలుండే ఒక సౌర విద్యత్‌ ప్రాజెక్టునూ తీసుకురానున్నారు. 2032 కల్లా 3 మిలియన్‌ టన్నుల హరిత హైడ్రోజన్‌ సామర్థ్యాన్ని లక్ష్యంగా కంపెనీ పెట్టుకుంది. సౌర, బ్యాటరీ స్టోరేజీ, హైడ్రోజన్‌.. ఇలా స్వచ్ఛ ఇంధన వ్యవస్థనంతా ఒక గొడుగు కిందకు తీసుకురానున్నట్లు ముకేశ్‌ తెలిపారు. జామ్‌ నగర్‌ను ‘కొత్త రిలయన్స్, సరికొత్త భారత్‌’కు ముఖచిత్రంగా మారుస్తామన్నారు.


అతిపెద్ద రెండో ప్లాట్‌ఫాం 

30 కోట్ల మంది వినియోగదార్లతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా జియోహాట్‌స్టార్‌గా మారింది. మొబైల్, టీవీ, కనెక్టెడ్‌ డివైజెస్‌లలో సేవలందిస్తున్న జియోస్టార్‌ 100 తెరలపై కనిపిస్తోందని ఆర్‌ఐఎల్‌ డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ పేర్కొన్నారు.


ఫుడ్‌పార్క్‌లపై రూ.40,000 కోట్లు

భారత్‌లోనే అతిపెద్ద రిటైలర్‌ అయిన రిలయన్స్‌ రిటైల్‌ వచ్చే మూడేళ్లలో 20% సమ్మిళిత వృద్ధిని సాధించడంపై ధీమాగా ఉంది. ‘రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌’తో ఎఫ్‌ఎమ్‌సీజీ వ్యాపారాన్ని వచ్చే అయిదేళ్లలో ఎనిమిదింతలు చేసి రూ.లక్ష కోట్లకు చేర్చుకోవాలని భావిస్తోంది. అంతే కాకుండా.. ఆసియాలోనే అతిపెద్ద ఫుడ్‌ పార్క్‌లను సృష్టించడం కోసం రూ.40,000 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ఆర్‌ఐఎల్‌ డైరెక్టర్‌ ఈశా అంబానీ తెలిపారు. 

  • స్మార్ట్‌గ్లాసెస్‌ విభాగంలోకి జియో అడుగుపెట్టింది. ‘జియోఫ్రేమ్స్‌’ ద్వారా చేతులతో పనిలేకుండానే కాల్స్‌ చేసుకోవడం, మ్యూజిక్‌ ఆన్‌/ఆఫ్‌ చేసుకోవడంతో పాటు వీడియోలను రికార్డ్‌ చేయొచ్చు. 
  • యాపిల్‌ సిరిలాగా ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌ రియాను అంబానీ ఆవిష్కరించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు