Saudi Arabia’s flyadeal: భారత్‌కు సౌదీ అరేబియా ఫ్లైయెడీల్‌ విమానాలు

Eenadu icon
By Business News Desk Updated : 03 Nov 2025 05:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

2026 తొలి త్రైమాసికం నుంచి..

దిల్లీ: వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన విపణిపై ఆశతో, సౌదీ అరేబియాకు చెందిన ఫ్లైయెడీల్‌ 2026 తొలి త్రైమాసికం నుంచి ముంబయితో పాటు మన దేశంలోని పలు నగరాలకు విమానాలను ప్రారంభించనుంది. ప్రపంచంలోనే అత్యంత పోటీ ఉన్న మార్కెట్లలో భారత్‌ ఒకటని, అక్కడ వెచ్చించే ప్రతి రూపాయిపై జాగ్రత్తగా దృష్టి సారించాల్సి ఉంటుందని విమానయాన సంస్థ సీఈఓ స్టీవెన్‌ గ్రీన్‌వే పీటీఐకి తెలిపారు. జెడ్డాలో ఉన్న సౌదియా ఎయిర్‌లైన్స్‌కు అనుబంధంగా ఉన్నఫ్లైయెడీల్‌ 8 ఏళ్లుగా లాభదాయకంగా విమానాలను నడుపుతోంది. ఈ ఏడాది ఆఖరుకు సంస్థ వద్ద 46 విమానాలు ఉండాలని ఆశిస్తోంది. ప్రస్తుతం 42 ఎ320 విమానాలను కలిగి ఉంది. 2027 జులై నుంచి ప్రారంభించబోయే 10 పెద్ద విమానాలు ఎ330 నియోలకు కూడా ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చింది. ‘వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలని అనుకుంటున్నాం. ముంబయి, దిల్లీ వంటి నగరాలకు తొలుత విమానాలు నడుపుతాం. అలాగే దేశంలోని రెండో అంచె నగరాలపైనా దృష్టి ఉంటుంది. ముంబయి మాత్రం ప్రాధాన్య జాబితాలో అగ్ర స్థానంలో ఉంటుంద’ని గ్రీన్‌వే వెల్లడించారు.

కెన్యా, ఈజిప్ట్‌లకు ఆకాశ ఎయిర్‌ సర్వీసులు

కెన్యా, ఇథియోపియా, ఈజిప్ట్, ఇతర దేశాలకు విమానాలు నడుపుతామని, బోయింగ్‌ విమానాల డెలివరీ షెడ్యూల్‌ చాలా బాగుందని విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ సీఈఓ వినయ్‌ దూబే వెల్లడించారు. అంతర్జాతీయ విస్తరణ సరైన మార్గంలో కొనసాగుతోందని, త్వరలో షార్జాకు విమానాలు నడిపే ప్రకటన వస్తుందని తెలిపారు. ఈ సంస్థ వద్ద 30 బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు ఉన్నాయి. ఈ ఏడాది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విమానాలను జత చేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం దోహా (ఖతార్‌), జెడ్డా, రియాద్‌ (సౌదీ అరేబియా), అబుధాబి (యూఏఈ), కువైట్‌ సిటీ (కువైట్‌), ఫుకెట్‌ (థాయ్‌ల్యాండ్‌)తో పాటు 24 దేశీయ గమ్యస్థానాలకు ఆకాశ ఎయిర్‌ విమానాలను నడుపుతోంది. ఈ సంస్థలో ప్రస్తుతం 750-775 మంది పైలట్లు ఉన్నారు. 2026లో మరి కొంత మందిని ముఖ్యంగా ఫస్ట్‌ ఆఫీసర్లను నియమించుకుంటామని దూబే తెలిపారు. 226 బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలకు ఆర్డర్‌ పెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌తో కోడ్‌షేర్‌ భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ వద్ద మూలధనం తగినంత ఉందని, వచ్చే 2-5 ఏళ్లలో ఐపీఓకు వస్తామని తెలిపారు.

Tags :
Published : 03 Nov 2025 03:22 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు