Stock market: సూచీలు పుంజుకోవచ్చు

Eenadu icon
By Business News Desk Published : 03 Nov 2025 03:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

నిఫ్టీ-50 తిరిగి 26,000కు చేరొచ్చు
ఆర్థిక ఫలితాల ఆధారంగా కదలికలు
బ్యాంకు, చమురు షేర్లకు సానుకూలతలు
విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

భారత స్టాక్‌ మార్కెట్లు ఈ వారం పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీ-50 తిరిగి తన 26,000 స్థాయిని అందుకోవచ్చని అంటున్నారు. ప్రస్తుత స్థాయులు కొనుగోళ్లకు అనుకూలంగా ఉన్నందున తాజా గరిష్ఠాలకు చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. ‘స్వల్పకాలానికి నిఫ్టీ-50 ధోరణి బలహీనంగా ఉన్నా.. మధ్యకాలానికి సానుకూలంగా కనిపిస్తోంది. 25,700 కంటే దిగువకు పడితే 25,500 వద్ద బలమైన మద్దతు లభించి, బాగా పుంజుకునేందుకు అవకాశం ఉంద’ని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. అయితే 25,800 దిగువన మార్కెట్‌ సెంటిమెంటు బలహీనపడవచ్చని మరికొంత మంది విశ్లేషకులంటున్నారు. ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు కీలకమని చెబుతున్నారు. వివిధ రంగాలపై మార్కెట్‌ విశ్లేషకులు ఏమంటున్నారంటే..

  • లోహ కంపెనీల షేర్లు సానుకూల ధోరణితో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు. కొంత దిద్దుబాటు, స్థిరీకరణ జరగొచ్చు. నిఫ్టీ మెటల్‌ సూచీకి 10500, 10400 వద్ద కీలక మద్దతు స్థాయులున్నాయి. మంగళవారం అదానీ ఎంటర్‌ప్రైజెస్, శుక్రవారం హిందాల్కో ఫలితాలున్నాయి. 
  • ఐటీ షేర్లు స్వల్పకాలంలో స్థిరీకరణకు గురికావొచ్చు. ఎటువంటి సానుకూల వార్తలూ లేనందున అర్థవంత రికవరీ జరగకపోవచ్చు. గత వారం ఫెడ్‌ రేట్ల కోత ప్రకటించినా, డిసెంబరులో కోతకు హామీనివ్వకపోవడంతో మార్కెట్‌ సెంటిమెంటు దెబ్బతింది.
  • నిఫ్టీ ఫార్మా సూచీ మరింత నష్టపోవచ్చు. బలహీన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్‌ సెంటిమెంటు డీలా పడింది. ఈ రంగంలో బలహీనతలు మరో రెండు వారాలు కొనసాగొచ్చు. నిఫ్టీ ఫార్మాకు 21,600 వద్ద మద్దతు, 22,500 వద్ద నిరోధం కనిపిస్తున్నాయి.
  • గత ఆరు నెలలుగా స్తబ్దుగా కదలాడుతున్న ఎఫ్‌ఎమ్‌సీజీ సూచీ ఈ వారమూ ఒక శ్రేణిలోనే కదలాడొచ్చు. జీఎస్‌టీ రేట్ల కోతతో చాలా వరకు ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల ఫలితాలపై ప్రభావం పడింది. అయితే ధరల పెంపు కొంత ఒత్తిడిని తగ్గించింది. 
  • ఎంపిక చేసిన యంత్రపరికరాల షేర్లు కదలాడవచ్చు. రాబోయే త్రైమాసికాల్లో ఆర్డర్లు తగ్గొచ్చన్న అంచనాలున్నాయి. ఏబీబీ ఇండియా గురువారం, సుజ్లాన్‌ ఎనర్జీ మంగళ వారం ఫలితాలను ప్రకటించనున్నాయి.
  • ఎటువంటి వార్తలూ లేనందున సిమెంటు కంపెనీలు చాలా తక్కువ శ్రేణిలో కదలాడవచ్చు. దీంతో ఫలితాల ఆధారంగా ఆయా కంపెనీల షేర్లు చలించొచ్చు. అంబుజా(సోమ), గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, రామ్‌కో సిమెంట్స్‌(బుధ) ఈ వారమే ఫలితాలను ప్రకటించనున్నాయి. 
  • ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐ పరిమితి పెంపు వార్తల మధ్య నిఫ్టీ బ్యాంక్‌ సూచీ ఈ వారం రాణించొచ్చు. మంగళవారం వెలువడే ఎస్‌బీఐ ఫలితాలు కీలకం కానున్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ 57,500 స్థాయి పైన నిలబడితే.. 58,500ను పరీక్షించొచ్చు. ఒక వేళ 57,500 స్థాయిని కోల్పోతే మాత్రం 57,000-56,800కు పడిపోవచ్చు.
  • చమురు-గ్యాస్‌ షేర్లు సమీప కాలంలో బులిష్‌ కదలికలను కొనసాగించవచ్చు. గత అయిదు వారాలూ రాణించిన ఈ సూచీ ఈ వారమూ అదే బాట పట్టవచ్చు. పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ 7న ఫలితాలను వెల్లడించనుంది. 
  • టెలికాం షేర్లు ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. సోమవారం వెలువడే భారతీ ఎయిర్‌టెల్‌ ఫలితాలను మదుపర్లు గమనించొచ్చు. ఆ కంపెనీ షేరు ఈ వారం          రూ.1,950-2,100 శ్రేణిలో కదలాడవచ్చు. వొడాఫోన్‌ ఐడియా రూ.9-10 మధ్య చలించొచ్చు.
  • నిఫ్టీ ఆటో సూచీ ఒక శ్రేణిలో చలించొచ్చు. శనివారం వెలువడ్డ వాహన విక్రయ గణాంకాలను, ఈ వారం వెలువడే మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్కార్ట్స్‌ కుబోటా, ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, బజాజ్‌ ఆటో ఫలితాలను గమనించాల్సి ఉంటుంది. 

ఈ వారం ఆర్థిక ఫలితాలు(నిఫ్టీ-50)

టైటన్, టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, మహీంద్రా అండ్‌ మహీంద్రా,  అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, సన్‌ఫార్మా, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్, ట్రెంట్, బజాజ్‌ ఆటో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు