Stock market: మదుపర్ల లాభాల స్వీకరణ

Eenadu icon
By Business News Desk Published : 01 Nov 2025 01:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ప్రైవేట్‌ బ్యాంకులు, లోహ షేర్లల్లో అమ్మకాలు
రూ.2.10 లక్షల కోట్లు తగ్గిన మదుపర్ల సంపద
ఎఫ్‌ఐఐ అమ్మకాలు- రూ.6769.34 కోట్లు
డీఐఐ కొనుగోళ్లు- రూ.7068.44 కోట్లు

వరుసగా రెండో రోజూ స్టాక్‌ మార్కెట్‌ డీలాపడింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, లోహ, విద్యుత్‌ రంగ కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ ఇందుకు కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడం ప్రభావం చూపింది. విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు దిగడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఒకపైసా తగ్గి 88.70 వద్ద ముగిసింది. బ్రెంట్‌ ముడి చమురు ధర 0.49% పెరిగి 65.32 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్, దక్షిణ కొరియా మినహా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడయ్యాయి. 

బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.2.10 లక్షల కోట్లు తగ్గి రూ.470.26 లక్షల కోట్ల (5.30 లక్షల కోట్ల డాలర్ల)కు పరిమితమైంది. 

స్వల్ప నష్టాలతో మొదలై..: బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (క్రితం ముగింపు 84,404.46) స్వల్ప నష్టంతో 84,379.79 పాయింట్ల వద్ద ఆరంభమైంది. ఆ తర్వాత వెంటనే లాభాల్లోకి వచ్చి 84,712.79 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. అనంతరం మళ్లీ నష్టాల్లోకి జారుకుని, చివరి వరకు అదే ధోరణిలో చలించింది. ఆఖరుకు 465.75 పాయింట్ల నష్టంతో 83,938.71 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 155.75 పాయింట్లు తగ్గి 25,722.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 25,711.20 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని; 25,953.75 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 273.17 పాయింట్లు, నిఫ్టీ 73.05 పాయింట్ల మేర నష్టపోయాయి.

5 మినహా మిగతావి నష్టాల్లో..: సెన్సెక్స్‌ 30  షేర్లలో 5 మినహా మిగతావి నష్టాల్లో ముగిశాయి. ఎటర్నల్‌  3.52%, ఎన్‌టీపీసీ 2.39%, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌  1.66%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.28%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.25%, పవర్‌గ్రిడ్‌ 1.17%, ట్రెంట్‌ 1.06%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.05% తగ్గాయి. భెల్‌ 3.95%, ఎల్‌అండ్‌టీ 1.09%, టీసీఎస్‌ 0.73%, ఐటీసీ 0.37%, ఎస్‌బీఐ  0.31% లాభపడ్డాయి. బీఎస్‌ఈ రంగాల సూచీల్లో లోహ, విద్యుత్, సేవలు, కమొడిటీస్, మన్నికైన వినియోగ వస్తువులు, ఆర్థిక సేవలు డీలాపడ్డాయి. ఇంధనం, ఇండస్ట్రియల్స్, భారీ యంత్రపరికరాలు, చమురు- గ్యాస్‌ సూచీలు రాణించాయి.  

ఐపీఓ సమాచారం

  • ఫిన్‌బడ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు ఇష్యూ ధరగా రూ.140- 142ను నిర్ణయించారు. ఈ ఐపీఓ నవంబరు 6న మొదలై 10న ముగియనుంది. ఫిన్‌బడ్‌ ఫైనాన్షియల్‌లో క్రికెటర్‌ ధోనికి పెట్టుబడులు ఉన్నాయి. 
  • లెన్స్‌కార్ట్‌ సొల్యూషన్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ మొదటి రోజున 1.13 రెట్ల స్పందన లభించింది. చిన్న మదుపర్ల విభాగంలో 1.31 రెట్లు అధికంగా బిడ్‌లు దాఖలయ్యాయి. నవంబరు 4న ఇష్యూ ముగియనుంది. 
  • ఓర్‌క్లా ఇండియా ఐపీఓ ముగిసే సరికి 48.73 రెట్ల స్పందన లభించింది. రిటెయిల్‌ విభాగంలో 7.05 రెట్లు అధికంగా బిడ్‌లు దాఖలయ్యాయి. 
  • స్టడ్స్‌ యాక్సెసరీస్‌ ఐపీఓ రెండో రోజుకు 5.08 రెట్ల స్పందన లభించింది. చిన్న మదుపర్ల విభాగంలో 6.02 రెట్లు అధికంగా బిడ్‌లు వచ్చాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు