Tesla: అంచనాల కంటే తక్కువ.. టెస్లాకు 600 బుకింగ్స్‌..!

Eenadu icon
By Business News Team Published : 02 Sep 2025 12:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్: టెక్‌ దిగ్గజం టెస్లా (Tesla) కార్లకు భారత్‌ (India)లో అనుకున్నంత స్పందన రాలేదు. ఇప్పటివరకు మొత్తం 600 బుకింగ్స్‌ మాత్రమే వచ్చినట్లు బ్లూమ్‌బెర్గ్‌ కథనంలో పేర్కొంది. వాస్తవానికి ఆ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కేవలం నాలుగు గంటల్లోనే ఇన్ని కార్లను విక్రయిస్తుంది. 

వాస్తవానికి కంపెనీ అంచనాల కంటే ఇవి చాలా తక్కువని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు బ్లూమ్‌బెర్గ్‌కు వెల్లడించారు. బుకింగ్స్‌ ఆధారంగా టెస్లా (Tesla) భారత్‌లోకి ఈ ఏడాది 350 నుంచి 500 కార్లను పంపించాలని ప్లాన్‌ చేస్తోంది. దీనికి సంబంధించిన తొలిబ్యాచ్‌ షాంఘై నుంచి ఈనెల మొదట్లో భారత్‌కు చేరుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ వాహనాల డెలివరీలు ముంబయి, దిల్లీ, పుణే, గురుగ్రామ్‌కు మాత్రమే పరిమితం చేయాలని కంపెనీ భావిస్తోంది. పూర్తిస్థాయి చెల్లింపులు జరిగిన తర్వాతనే కార్లను హ్యాండోవర్‌ చేస్తుంది. మరోవైపు బ్లూమ్‌ బెర్గ్‌ పబ్లిష్‌ చేసిన రిపోర్టుపై టెస్లా స్పందించలేదు.  

భారత్‌లో టెస్లా (Tesla) మోడల్‌-3 కారును ప్రవేశపెట్టాలనుకుంది. కానీ, ఇక్కడ 100 శాతం పన్నులు ఉండటంతో దాని ప్రణాళికలో తీవ్ర జాప్యం జరిగింది. ఇక ‘మోడల్‌ వై’తో భారత మార్కెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమై బుకింగ్స్‌ ప్రారంభించింది. భారత్‌ (India) లో సగటు ఎలక్ట్రిక్‌ కారు ధర రూ.22 లక్షలు ఉంటే.. టెస్లా మోడల్‌ వై ధర దాదాపు రూ.60 లక్షల వరకు ఉంది. 

ఇక్కడ ఆర్‌డబ్ల్యూడీ వెర్షన్‌ (బేస్‌) ‘మోడల్‌ వై’ ధర రూ.61.07 లక్షలుగా (ఆన్‌రోడ్‌) నిర్ణయించింది. లాంగ్‌-రేంజ్‌ వెర్షన్‌ ధర రూ.69.15 లక్షలుగా ఉంది. బేస్‌ మోడల్‌ ధర అమెరికాలో 44,990 డాలర్లు (రూ.38.63 లక్షలు), చైనాలో 2,63,500 యువాన్లు (రూ.31.57లక్షలు) జర్మనీలో 45,970 యూరోలు (రూ.46.09లక్షలు)గా ఉంది. దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చుల కారణంగా భారత్‌లో దీని ధర ఎక్కువగా ఉంది.

చిప్‌ డిజైన్‌ ఇంజినీర్లలో 20 శాతం మంది భారత్‌లోనే..

కొన్నిరోజుల క్రితం భారత రోడ్లపై ‘మోడల్‌ Y’ (Model Y) ను పరీక్షించిన సంగతి తెలిసిందే. ముంబయి-పుణే జాతీయరహదారిపై ఈ వాహనం దర్శనమివ్వడం చూపరులను ఆకర్షించింది. ఇది పూర్తిగా అప్‌డేట్‌ అయిన మోడల్‌ Y కారుగా నిపుణులు గుర్తించారు. దీని కోడ్‌నేమ్‌ జునిపెర్‌. సాధారణ మోడల్‌ Y కంటే దీనిలో ఎక్కువ ఫీచర్లు ఉంటాయి. అమెరికా, కెనడా మార్కెట్లలో వీటిని విక్రయిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు