ఏ రాష్ట్ర తీరానికో టెస్లా!

Eenadu icon
By Business News Desk Updated : 28 Feb 2025 07:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

అమెరికాకు చెందిన విద్యుత్తు కార్ల దిగ్గజ సంస్థ టెస్లా మనదేశంలో అడుగుపెట్టడానికి రంగం సిద్ధమైంది. ముంబయి, పుణెలలో ఉద్యోగులను నియమించుకునేందుకూ ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది. తొలి దశలో కార్లు దిగుమతి చేసుకుని, ఇక్కడ విక్రయించనుంది. ఆ తర్వాత దేశంలో కార్ల అసెంబ్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలనేది టెస్లా ప్రణాళిక. సీకేడీ (కంప్లీట్‌లీ నాక్డ్‌ డౌన్‌) పద్ధతిలో విడిభాగాలు తీసుకువచ్చి, ఇక్కడ అసెంబుల్‌ చేసి విక్రయిస్తుందని.. ఆ తర్వాత విడిభాగాలు సహా పూర్తిస్థాయిలో కార్లను మన దేశంలోనే ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉందని తెలుస్తోంది.  

పోటీలో 

రాయితీలే కీలకం

టెస్లా పెద్ద బ్రాండు కావడంతో, ఆ సంస్థను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. టెస్లా యూనిట్‌ ఏర్పాటైన రాష్ట్రానికి ఇతర విద్యుత్తు వాహన సంస్థలు, బ్యాటరీలు, విడిభాగాల ఉత్పత్తి కంపెనీలు క్యూ కట్టే అవకాశం ఉంది. అందువల్ల విద్యుత్తు వాహనాల రంగంలో కీలకంగా మారి, పెద్ద సంఖ్యలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించొచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన. ఈ రేసులో మహారాష్ట్ర, తమిళనాడు ముందున్నాయని.. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలూ రేసులో ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. తమ వద్ద ఉన్న సదుపాయాలు, తాము కల్పించే రాయితీలు, ప్రోత్సాహకాలు వివరించి టెస్లా యాజమాన్యాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి.  

ఏం కావాలి?

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం టెస్లా పరిగణనలోకి తీసుకునే అంశాలివీ..

  • పోర్టు సదుపాయం తప్పనిసరి. తొలిదశలో కార్లను ఐరోపా లేదా చైనా నుంచి దిగుమతి చేసుకునేందుకు, ఆ తర్వాత విడిభాగాలను దిగుమతి చేసుకుని, ఇక్కడ అసెంబుల్‌ చేయాలి.
  • బ్యాటరీ, మోటార్‌ విడిభాగాలు, బాడీ ప్యానెళ్లు తయారు చేసే యూనిట్ల స్థాపనకు అనువైన పరిస్థితులు, వసతులు ఉండాలి. 
  • నైపుణ్యం గల మానవ వనరుల లభ్యత.  
  • స్థలం, పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు, అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. 
  • దేశవ్యాప్తంగా వాహనాల పంపిణీకి అవసరమైన లాజిస్టిక్స్‌ సదుపాయాలు

ఎవరి సత్తా ఎంత? 

పోటీపడుతున్న రాష్ట్రాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర అయితే, ప్రభుత్వం పట్టుదలగా ప్రయత్నిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉంది. ఈ రాష్ట్రాల్లో స్థితిగతులు చూస్తే..

గుజరాత్‌: ప్రధాని మోదీ చొరవతో గుజరాత్‌ నాలుగైదేళ్లలో టాటా మోటార్స్, సుజుకీ మోటార్స్‌ వంటి అగ్రశ్రేణి సంస్థలను ఆకర్షించింది. రాయితీలు, ప్రోత్సాహకాలతో ఆకట్టుకుంటోంది. ముంద్రా పోర్టు ఉంది. విద్యుత్తు సరఫరా వ్యవస్థ మెరుగుపడినా, మానవ వనరుల కొరత ఉంది. 

కర్ణాటక: మహారాష్ట్ర, తమిళనాడుకు తగ్గకుండా కర్ణాటకలోనూ సానుకూల పరిస్థితులున్నాయి. సిలికాన్‌ వ్యాలీ వంటి బెంగళూరు పెద్ద ఆకర్షణీయ అంశం. టెస్లా అంటే టెక్నాలజీ దిగ్గజం కూడా. టయోటా, వోల్వో వంటి సంస్థలు ఎన్నో ఏళ్లుగా ఈ రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కాకపోతే మంగళూరు పోర్టు అంత అనువైనది కాదనే అభిప్రాయం ఉంది. 

తమిళనాడు: ‘భారతదేశపు డెట్రాయిట్‌’ గా చెన్నైకి పేరుంది. అశోక్‌ లేలాండ్, ఫోర్డ్, రెనో- నిస్సాన్, హ్యుందాయ్‌.. తదితర కంపెనీల యూనిట్లు చెన్నై సమీపంలో ఉన్నాయి. ఆటోమొబైల్‌ సప్లయర్‌ నెట్‌వర్క్‌ పెద్దది. మానవ వనరుల కొరత లేదు. చెన్నై, ఎన్నోర్‌ పోర్టుల ద్వారా దిగుమతులు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు సానుకూలంగా ఉంటుంది. 

మహారాష్ట్ర: పారిశ్రామికీకరణ అధికం. వాహన పరిశ్రమకు కేంద్ర స్థానం. ముంబయి ఆర్థిక రాజధాని కాగా, పుణె ఆటోమొబైల్‌ కేంద్రం. మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్, కైనెటిక్, టాటా మోటార్స్‌ వంటి దిగ్గజ సంస్థలున్నాయి. ముంబయిలోని పోర్టు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు సానుకూలతలే. కాకపోతే భూముల ధర ఎంతో ఎక్కువ. కార్మిక వ్యయాలూ అధికమే.

ఆంధ్రప్రదేశ్‌: అతిపెద్ద తీరప్రాంతం, విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు నాలుగైదు పోర్టులు ఉండటం ఆంధ్రప్రదేశ్‌కు కలిసొచ్చే అంశం. రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల అత్యంత ముఖ్యాంశం. అన్ని రకాల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి, శరవేగంగా మౌలిక వసతులు కల్పించి.. బెంగళూరు సమీపంలోని అనంతపురం జిల్లాలో కొరియా సంస్థ కియా మోటార్స్‌ ప్లాంట్‌ ఏర్పాటయ్యేలా చంద్రబాబు ప్రభుత్వమే గతంలో చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇదే తరహాలో టెస్లా కోరుకున్న సదుపాయాలన్నీ అందించి, ఈ యూనిట్‌నూ సాధించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. చెన్నైకి సమీపంలోని శ్రీసిటీ సెజ్‌లో ఇసుజు కార్ల కంపెనీతో పాటు విడిభాగాల సంస్థలు 15 ఉన్నాయి. చెన్నైలోని కార్ల కంపెనీలకు ఇక్కడి నుంచి విడిభాగాలు వెళ్తున్నాయి. ఈ సమీపంలోనే హీరో ప్లాంటు ఉంది.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :
Published : 28 Feb 2025 03:48 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు