Promotional marketing: అనవసరపు ఫోన్‌కాల్స్‌ వేధిస్తున్నాయా.. ఈ టిప్స్‌ పాటించండి!

Eenadu icon
By Business News Team Published : 02 Aug 2025 12:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: నరేంద్ర పనిలో చాలా బిజీగా ఉన్నాడు. అంతలో ఫోన్‌ మోగింది. చూస్తే కొత్త నెంబర్‌. ఎవరో అత్యవసరంగా ఫోన్‌ చేశారేమో అనుకొని ఆన్సర్‌ చేశాడు. తీరా చూస్తే.. ‘‘ సార్‌.. బ్యాంక్‌ నుంచి కాల్ చేస్తున్నాం. వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంది. లోన్‌ ఏమైనా తీసుకుంటారా?’’ అని అడిగారు. ఒక్కసారిగా అతడికి చిర్రెత్తుకొచ్చింది. కానీ, ఓపిక తెచ్చుకొని.. అవసరం లేదండీ అని ఫోన్‌ పెట్టేశాడు. అలాగే, సురేంద్రకు ఎవరో ఫోన్‌ చేసి..  ఫలానాచోట తక్కువ ధరకే ఓపెన్‌ ప్లాట్లు ఉన్నాయి. బ్యాంకు లోన్‌ కూడా వస్తుంది. మంచి అవకాశం సార్‌.. తీసుకోండి అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నెలాఖరు వచ్చే సరికి కుటుంబం గడవడమే గగనమైపోతోంది. ఇంకా ప్లాట్లు ఎలా కొంటానండీ అంటూ నిట్టూరుస్తూ ఫోన్‌ పెట్టేశాడు. వీళ్లిద్దరికే కాదు.. చాలామందికి ఇదేతరహా అనుభవం ఎదురవుతూ ఉంటుంది. ప్రతిరోజూ ఇలా ప్రమోషనల్‌, మార్కెటింగ్‌ కాల్స్‌ (Promotional and Marketing Calls) చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, చిన్నచిన్న చిట్కాలతో వీటిని కట్టడి చేయొచ్చు. అవేంటో చూద్దామా?

1. యాక్టివేట్‌ డీఎన్‌డీ (Do not Disturb)

ప్రమోషనల్‌, మార్కెటింగ్‌ ఫోన్‌కాల్స్‌ రాకుండా ఉండాలంటే మొట్టమొదట చేయాల్సిన పని.. మీ ఫోన్‌ నెంబర్‌పై డీఎన్‌డీ (DND) ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేయాలి. ప్రధానంగా మూడు రకాలుగా దీనిని ఎనేబుల్‌ చేసుకోవచ్చు.

1. ఎస్‌ఎంఎస్‌ ద్వారా..

START 0 అని టైప్‌ చేసి.. 1909కి ఎస్‌ఎంఎస్‌ చేయాలి. దీంతో అన్ని సంస్థల నుంచి ప్రమోషనల్‌ కాల్స్‌ ఆగిపోతాయి. అయితే, దీనివల్ల మనకు అవసరమైన బ్యాంక్‌ లావాదేవీలకు సంబంధించిన మెసేజ్‌లు కూడా రావన్న సంగతి గమనించాలి.

2. ట్రాయ్‌ డీఎన్‌డీ వెబ్‌సైట్‌ (TRAI)

https://www.dndcheck.co.in/ వెబ్‌సైట్లోకి వెళ్లి.. ‘నేషనల్‌ డునాట్‌ కాల్‌ రిజిస్టరీ’లో రిజిస్టర్‌ చేసుకున్నా ప్రమోషనల్‌ కాల్స్‌కు అడ్డుకట్ట వేయొచ్చు.

3. టెలికమ్‌ ప్రొవైడర్‌ యాప్‌ ద్వారా.. (Telecom Provider)

దాదాపు టెలికామ్‌ ప్రొవైడర్లందరికీ.. అధికారిక యాప్‌ ఉంటుంది. (ఉదాహరణకు మై జియో, ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌, వీఐ యాప్‌). అందులో డీఎన్‌డీ సెట్టింగ్స్‌కు వెళ్లి ప్రిఫరెన్స్‌ ఎంపిక చేసుకోవడం ద్వారా ప్రమోషనల్‌ కాల్స్‌ను బ్లాక్‌ చేయొచ్చు.

2. మాన్యువల్‌ నంబర్‌ బ్లాకింగ్‌ (Manual number Blocking)

డీఎన్‌డీ సెట్టింగ్స్‌ను యాక్టివేట్‌ చేసినప్పటికీ అనవసరమైన ఫోన్లు వస్తుంటే.. ఫోన్‌లోని కాల్‌ బ్లాకింగ్‌ ఫీచర్‌ను ఉపయోగించి అడ్డుకట్ట వేయొచ్చు. అంతేకాకుండా ట్రూకాలర్‌, కాల్‌ బ్లాకర్‌ లాంటి థర్డ్‌ పార్టీ యాప్‌లు కూడా ఉన్నాయి. అవి స్పామ్‌, బ్యాంక్‌ మార్కెటింగ్‌ కాల్స్‌ని గుర్తిస్తాయి. ఒకసారి కాల్‌ వచ్చినప్పుడు ‘మార్క్‌ కాల్స్ యాజ్‌ స్పామ్‌’ ఆప్షన్‌ ఎంచుకుంటే.. ఆ తర్వాతి నుంచి ఆయా నెంబర్ల నుంచి కాల్స్‌ రావు.

3. నేరుగా బ్యాంక్‌కే సమాచారం

ప్రత్యేకంగా ఒకే బ్యాంక్‌కు చెందిన మార్కెటింగ్‌ సిబ్బంది నుంచి తరచూ కాల్స్‌ వస్తుంటే.. ఆ బ్యాంకు కస్టమర్‌కేర్‌ సర్వీసుకు కాల్‌ చేసి గానీ, లేదంటే నేరుగా బ్రాంచ్‌కి వెళ్లి గానీ, ‘అప్‌డేట్‌ యువర్‌ ప్రిఫరెన్సెస్‌’ను మార్చాలని కోరండి. అంతేకాకుండా గతంలో మీరు ‘మార్కెటింగ్‌ కమ్యూనికేషన్‌’కు అంగీకారం తెలిపినట్లయితే.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కచ్చితంగా చెప్పండి.

4. ట్రాయ్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా..

డీఎన్‌డీ ఆప్షన్‌ను యాక్టివేట్‌ చేసినప్పటికీ.. కాల్స్‌ వస్తుంటే.. నేరుగా 1909కి ఫోన్‌ చేసి.. ఫిర్యాదు చేయొచ్చు. https://www.nccptrai.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు.

5. అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా..

బ్యాంక్‌ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో లాగిన్‌ అయి.. కమ్యూనికేషన్‌ ప్రిఫరెన్సెస్‌ లేదా ప్రొఫైల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. మార్కెటింగ్‌/ ప్రమోషనల్‌ ఈ మెయిల్స్‌/ ఎస్‌ఎంఎస్‌/ కాల్స్‌ ఆప్షన్‌ను డిజేబుల్‌ చేయడం ద్వారా అనవసరపు ఫోన్ కాల్స్‌ని నియంత్రించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని