Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో లోయలో పడిన వాహనం.. 18 మంది గిరిజనుల దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కబీర్‌ధామ్‌ జిల్లా(కవర్ధా) బహపానీ గ్రామ సమీపంలో సోమవారం ఓ వాహనం లోయలో పడి 18 మంది గిరిజనులు మృత్యువాత పడ్డారు.

Published : 21 May 2024 05:05 IST

మృతుల్లో 17 మంది మహిళలే 

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కబీర్‌ధామ్‌ జిల్లా(కవర్ధా) బహపానీ గ్రామ సమీపంలో సోమవారం ఓ వాహనం లోయలో పడి 18 మంది గిరిజనులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో 17 మంది మహిళలు ఉన్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కుక్‌దూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సెమ్‌రా గ్రామానికి చెందిన 48 మంది గిరిజనులు సమీప అటవీ ప్రాంతానికి బీడీ ఆకులు సేకరించేందుకు ఉదయం ఓ వాహనంలో వెళ్లి, మధ్యాహ్న సమయంలో బీడీ ఆకుల మూటలతో అదే వాహనంలో తిరిగి వస్తున్నారు. బహపానీ గ్రామ సమీపంలో ఓ మూలమలుపు వద్ద సుమారు 20 అడుగుల లోయ ఉంది. డ్రైవర్‌ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా వాహనం అదుపుతప్పి ఆ లోయలో పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మహిళలు, ఒక పురుషుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో అయిదుగురు మహిళలు చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. ఈ దుర్ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

రాష్ట్రపతి ముర్ము విచారం

రోడ్డు ప్రమాదంలో 18 మంది గిరిజనుల మృతిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని