Odisha: 11 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం

ఒడిశాలో 11 ఏళ్ల గిరిజన విద్యార్థినిపై ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డారు.

Updated : 11 Nov 2023 01:38 IST

భువనేశ్వర్‌: ఒడిశా(Odisha)లో దారుణం చోటుచేసుకుంది. 11 ఏళ్ల గిరిజన విద్యార్థినిపై ఇద్దరు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నబరంగ్‌పుర్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని మరుగుదొడ్డిలో ఉండగా పాఠశాల హెడ్‌ మాస్టర్‌తోపాటు మరో ఉపాధ్యాయుడు బలవంతంగా గదిలోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్టు చేశారు. 

నబరంగ్‌పుర్‌ ఎస్పీ రోహిత్‌ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్‌ 7 బాలికపై అత్యాచారం జరగగా, రెండురోజుల అనంతరం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికకు కడుపులో నొప్పిరావడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు లైంగిక దాడి జరిగిందని గుర్తించారు. దీంతో ఆమె తల్లిదండ్రులు అదేరోజు కుందేయి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక చెప్పిన వివరాల మేరకు పాఠశాల హెడ్‌మాస్టర్‌, మరో ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇద్దరు ఉపాధ్యాయులపై ఐపీసీ, పోక్సో చట్టం కింద పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలికకు నబరంగ్‌పుర్‌ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఈ ఘటనపై ఒడిశా మానవహక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. నబరంగ్‌పుర్‌ జిల్లా మెడికల్‌ ఆఫీసర్‌ నుంచి నివేదిక కోరింది. రాష్ట్ర పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్‌ నాలుగువారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాలికకు సరైన వైద్య సదుపాయాన్ని కల్పించాలని స్పష్టం చేసింది. ఇక ఈ విషయంపై ప్రతిపక్షాలు భాజపా, కాంగ్రెస్‌లు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. మహిళలు, అమ్మాయిలపై రాష్ట్రంలో రోజురోజులకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని తీవ్ర విమర్శలు గుప్పించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని