Delhi: బేబీకేర్‌ ఆసుపత్రిలో అగ్గి

ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రే వారి పాలిట మృత్యుపాశమైంది. అకస్మాత్తుగా ఎగసిన మంటలు ఏడుగురు నవజాత శిశువులకు మరణ శాసనం లిఖించాయి. కన్నతల్లులకు కడుపుకోత మిగిల్చిన ఈ విషాద ఘటన దిల్లీలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది.

Published : 27 May 2024 05:02 IST

ఏడుగురు శిశువుల దుర్మరణం
దిల్లీలో దుర్ఘటన

దిల్లీ: ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రే వారి పాలిట మృత్యుపాశమైంది. అకస్మాత్తుగా ఎగసిన మంటలు ఏడుగురు నవజాత శిశువులకు మరణ శాసనం లిఖించాయి. కన్నతల్లులకు కడుపుకోత మిగిల్చిన ఈ విషాద ఘటన దిల్లీలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. పరారైన హాస్పిటల్‌ నిర్వాహకుడు డాక్టర్‌ నవీన్‌ కిచిని పోలీసులు ఆదివారం అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఆసుపత్రికి ఇచ్చిన అనుమతుల గడువు మార్చి 31న ముగిసినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రాన్ని నిర్వాహకులు పొందలేదనీ తెలిసింది. అక్కడి వైద్యుల అర్హతలపైనా అధికారులు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న డాక్టర్‌ ఆకాశ్‌నూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తూర్పు దిల్లీలోని వివేక్‌ విహార్‌లో ఇరుకైన వీధిలో ఉన్న బేబీకేర్‌ హాస్పిటల్‌లో వివిధ రుగ్మతలతో వచ్చిన నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు. అందరూ నెల రోజుల లోపు వయసు వారే. శనివారం రాత్రి ఒక్కసారిగా పెద్ద శబ్దం... ఆ వెంటనే ఉవ్వెత్తున మంటలు వ్యాపించాయి. కాలనీవాసులు పరుగున వచ్చి భవనం వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా స్థానిక స్వచ్ఛంద సంస్థ షహీద్‌ సేవా దళ్‌ కార్యకర్తలు 12 మంది చిన్నారులను సమీపంలోని మరో ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఆరుగురు ఆ తర్వాత తుది శ్వాస విడిచారు. మిగిలిన అయిదుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే వైద్య సిబ్బంది పరారయ్యారని స్థానికులు ఆరోపించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్లను అక్రమ పద్దతుల్లో రీఫిల్లింగ్‌ చేస్తున్నారని స్థానికుడు ఒకరు వెల్లడించారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే మంటలు ఎగిశాయని ప్రాథమికంగా భావిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సురేంద్ర చౌధరి వెల్లడించారు. ఆక్సిజన్‌ సిలిండర్లు పేలడంతో పక్కపక్కనే ఉన్న రెండు భవనాలు ధ్వంసమయ్యాయని దిల్లీ అగ్నిమాపక విభాగ అధికారి రాజేంద్ర పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై దిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్‌ దర్యాప్తునకు ఆదేశించింది.

రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారులు చనిపోవటం మనసును కలవరానికి గురిచేసిందని తెలిపారు. చికిత్స పొందుతున్న చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేల చొప్పున అందజేయనున్నారు. అగ్ని ప్రమాదం కారణాలపై విచారణ జరుపుతున్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చెప్పారు. చిన్నారుల మృతి, అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ ప్రియాంక్‌ కనూంగో తెలిపారు.

మరో ఘటనలో ముగ్గురి మృతి

తూర్పుదిల్లీలోని కృష్ణానగర్‌లో శనివారం అర్ధరాత్రి నాలుగు అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగాయి. ఆ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది 13 మందిని రక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని