Kota: కోటా హాస్టల్‌లో అగ్నిప్రమాదం..7గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

రాజస్థాన్‌, కోటాలోని కున్హాడీ వద్ద ఉన్న ఓ హాస్టల్‌లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Published : 14 Apr 2024 19:37 IST

కోటా: రాజస్థాన్‌, కోటాలోని కున్హాడీ వద్ద ఉన్న ఓ హాస్టల్‌లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్‌లో షాట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లుగా అధికారులు తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో హాస్టల్‌లోని 61 గదుల్లో సుమారుగా 75 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటన ఉదయం 6గంటలకు చోటుచేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో  మంటలు నిమిషాల్లో హాస్టల్‌లోని మూడు అంతస్తులకు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు, పొగలు వ్యాపించడంతో భయభ్రాంతులకు గురైన విద్యార్థులు  తప్పించుకోవడానికి పరుగులు పెట్టారు. మరికొందరు విద్యార్థులు తమను తాము రక్షించుకోవడానికి మొదటి, రెండో అంతస్తులోని బాల్కనీ నుంచి దూకడంతో గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే  ఘటనా స్థలానికి చేరుకుని మిగిలిన విద్యార్థులను రక్షించారు. అగ్నిమాపక యంత్రాలు  3గంటల పాటు శ్రమించి మంటలను  ఆర్పివేశాయి. 

ఆరుగురు విద్యార్థులకు కాలిన గాయాలవ్వగా, ఓ విద్యార్థి మొదటి అంతస్తు బాల్కనీ నుంచి దూకేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. స్వల్పగాయాలతో బయట పడిన వారికి ప్రాథమిక చికిత్స అందించామన్నారు. ‘హాస్టల్‌లో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్ లేకపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. మెట్ల నుంచి దిగి తప్పించుకునే ప్రయత్నంలో చాలా మంది గాయపడ్డారు. హాస్టల్ యజమాని నరేష్ ధాఖర్,  డైరెక్టర్ హితేష్ జైన్‌లను అదుపులోకి తీసుకున్నాం. తదుపరి విచారణ కొనసాగుతోంది’ అని పోలీసు అధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని