Rajamahendravaram: దత్త పుత్రిక దాష్టీకం.. ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన బాలిక

ఓ వృద్ధురాలిని దత్తపుత్రిక ప్రియుడితో కలిసి హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. కేసు వివరాలను డీఎస్పీ మీడియాకు వెల్లడించారు.

Published : 21 Oct 2023 21:09 IST

రాజమహేంద్రవరం నేరవార్తలు: దంపతులిద్దరూ ప్రభుత్వ శాఖలో ఉద్యోగులు. సంతానం లేకపోవడంతో.. చిన్నారిని దత్తత తీసుకుని పెంచుకోవాలనుకున్నారు. అనుకున్న ప్రకారం ఓ పేద కుటుంబంలోని నెలల చిన్నారి (బాలిక)ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం దత్తత తీసుకున్నారు. చిన్నారిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆ బాలికే పెంపుడు తల్లికి యమపాశమవుతుందని వారు గ్రహించలేకపోయారు. రూ.కోట్ల ఆస్తికి వారసురాలు ఆ బాలికే కదా అని అడిగింది లేదనకుండా ఇచ్చారు. అదే పెంపుడు తల్లికి శాపంగా మారింది.

13 ఏళ్ల బాలిక 19ఏళ్ల యువకుడితో ప్రేమాయణం..

13 ఏళ్లకే ఆ బాలిక చెడు వ్యసనాల బారిన పడింది. పుట్టినరోజు వచ్చిందంటే రూ.లక్షల్లో ఖర్చు. 13 ఏళ్లకే.. 19 ఏళ్ల యువకుడితో ప్రేమాయణం. వారికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం, ప్రియుడు, స్నేహితులతో కలిసి జల్సాలు చేయడం బాలికకు పరిపాటిగా మారింది. ఈ విషయం పెంపుడు తల్లికి తెలిసి మందలించడం మొదలు పెట్టింది. దీంతో తల్లి, కుమార్తెల మధ్య వివాదాలు మొదలయ్యాయి. తల్లి చెబుతున్న మాటలన్నీ తనపై ద్వేషంతో చెబుతున్నట్లుగా బాలిక భావించింది. తల్లి తనకు తలపోటుగా మారిందని ప్రియుడు, స్నేహితులతో చెప్పడంతో వారు బాలికకు అక్రమ మార్గం సూచించారు. వారు చెప్పిన మాటలకు బాలిక తలాడించడంతో.. తల్లిని అడ్డుతొలగించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రమాదవశాత్తూ తల్లి స్నానాల గదిలో జారి పడి విశ్రాంతి తీసుకుంటున్న తరుణంలో ప్రియుడితోపాటు.. మరో ఇద్దరు స్నేహితులను అర్ధరాత్రి ఇంటికి రప్పించింది. తల్లి.. ముక్కు, నోరు తుండుతో నొక్కిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేయించింది. అనంతరం ఏమీ తెలియనట్లుగా ఆసుపత్రికి తీసుకువెళ్లింది. మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణలో మొత్తం విషయాలు బయటకు వచ్చాయి. కేసు వివరాలను డీఎస్పీ విజయ్‌పాల్‌ శనివారం మీడియాకు వెల్లడించారు.

పోలీసులకు చిక్కిందిలా...

రాజమహేంద్రవరంలోని కంబాలపేటకు చెందిన మార్గరెట్ జులియాన(63) అనే విశ్రాంత ఉపాధ్యాయురాలు.. తన 13 ఏళ్ల కుమార్తెతో కలిసి నివాసముంటున్నారు. ఆమె భర్త నాగేశ్వరరావు ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ అనంతరం రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. జులియాన ఆస్తమాతో పాటు వివిధ ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో 13 ఏళ్ల కిందట కాకినాడ ప్రాంతానికి చెందిన ఓ నిరుపేద కుటుంబంలోని నెలల చిన్నారిని దత్తత తీసుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అక్టోబరు 17న సాయంత్రం జులియాన బాత్‌రూమ్‌లో ప్రమాదవశాత్తూ జారిపడిపోయింది. వెంటనే కుమార్తెతో పాటు ఇరుగుపొరుగువారు వచ్చి.. ఆమెను మంచంపై పడుకోబెట్టి విశ్రాంతి తీసుకోవాలని చెప్పి వెళ్లిపోయారు. మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో తన తల్లి అపస్మాకర స్థితిలో ఉందని బాలిక సీతానగరంలో ఉండే జులియనా మరిది అంజియాకు ఫోన్ చేసి చెప్పింది.

అతను వచ్చి ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గ మధ్యలోనే వృద్ధురాలు మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. అంజియా ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పెంపుడు కుమార్తె చెబుతున్న మాటలకు, పంచనామా నివేదికకు పొంతనలేదని పోలీసులు గుర్తించారు. బాలికపై అనుమానం రావడంతో ఆమె కదలికలపై నిఘా పెట్టారు. అదే ప్రాంతానికి చెందిన గారా ఆకాష్ (19)తో బాలిక ప్రేమాయణం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన నాటి నుంచి ఆకాష్ తోపాటు మరో ఇద్దరు అతడి స్నేహితులు ఆదృశ్యం కావడంతో పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్, రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం నిందితులను అదుపులోకి తీసుకోగా.. వారు నేరం అంగీకరించినట్టు డీఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని