Vijayawada: పెళ్లికి నిరాకరించడంతో మహిళపై యాసిడ్‌ దాడి

తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించటంతో ఓ వ్యక్తి యాసిడ్‌ దాడికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలంలో చోటుచేసుకుంది.

Published : 10 Jul 2023 08:13 IST

ఎన్టీఆర్‌ జిల్లాలో ఘటన
గాయాలపాలైన బాధితురాలు

నందిగామ, న్యూస్‌టుడే: తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించటంతో ఓ వ్యక్తి యాసిడ్‌ దాడికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలంలో చోటుచేసుకుంది. ఐతవరానికి చెందిన ఓ మహిళకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా.. పది నెలల క్రితం భర్త మృతిచెందాడు. నెల్లూరు జిల్లా రాజేంద్రనగర్‌ కుక్కలగుంటకు చెందిన ఆటో డ్రైవర్‌ రాసింగారం మణిసింగ్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే అతడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పుడప్పుడు నెల్లూరు నుంచి వచ్చి వెళ్తుండేవాడు. ఇటీవల మణిసింగ్‌కు టి.బి. రావటంతో ఆమె దూరం పెట్టింది. వివాహం చేసుకుందామని కోరినా నిరాకరించింది. ఈ క్రమంలో శనివారం రాత్రి యాసిడ్‌ బాటిల్‌తో ఐతవరం వచ్చిన నిందితుడు.. ఆమె ఇంట్లోనే నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంటి బయటకు వచ్చాడు. ఆమె తిరిగి ఇంట్లోకి వెళ్లేటప్పుడు వెనకనుంచి యాసిడ్‌ పోశాడు. బాధితురాలితో పాటు ఆరేళ్ల కుమారుడు, అక్క కుమార్తెపైన యాసిడ్‌ పడటంతో వారికీ స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాలిని నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి గొల్లపూడిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆమెకు 20% కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. నందిగామ ఏసీపీ, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ బాధితురాలిని పరామర్శించారు.

నిందితుడి అరెస్టు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే:   యాసిడ్‌ దాడికి పాల్పడిన మణిసింగ్‌(34)ను అరెస్టు చేసినట్లుకమిషనర్‌ కాంతిరాణా టాటా వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం కమిషనర్‌ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఫేస్‌బుక్‌ ద్వారా నిందితునికి మహిళతో పరిచయం ఏర్పడినట్టు తెలిపారు. బాధితురాలికి ఐసీడీఎస్‌ ద్వారా నష్టపరిహారం అందేలా కలెక్టర్‌తో మాట్లాడతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు