Telangana ACB: బినామీల గుట్టు తేల్చేలా దర్యాప్తు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కిన హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు బినామీల గుట్టు తేల్చడంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టిసారించింది.

Updated : 26 May 2024 05:50 IST

ఏసీపీ ఉమామహేశ్వరరావుతో పాటు బంధువులను విచారించనున్న ఏసీబీ
కస్టడీ పిటిషన్‌పై రేపు తీర్పు!

ఈనాడు, హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కిన హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు బినామీల గుట్టు తేల్చడంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టిసారించింది. ఆయన పేరిట సుమారు రూ.3.5 కోట్ల విలువైన (ప్రభుత్వ ధరల ప్రకారం) ఆస్తులున్నట్లు అనిశా గుర్తించిన సంగతి తెలిసిందే. వాటిలో చాలావరకు బంధువులు, సన్నిహితుల పేర్లతోనే ఉండటంతో, వారిని బినామీలుగా తేల్చే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఉమామహేశ్వరరావును పది రోజుల కస్టడీకి ఇవ్వాలని అనిశా ఇప్పటికే పిటిషన్‌ దాఖలు చేయగా సోమవారం నిర్ణయం వెలువడే అవకాశముంది. కస్టడీకి అనుమతి లభిస్తే బినామీల అంశంపైనే ప్రధానంగా విచారించనున్నారు.  

ఇటీవలే ఉమామహేశ్వరరావు ఇంటితోపాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో మొత్తం 11 చోట్ల అనిశా నిర్వహించిన సోదాల్లో పెద్దఎత్తున చర, స్థిరాస్తుల పత్రాలు లభించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ విలువ ప్రకారం వీటి విలువ రూ.3.5 కోట్లే అయినా, బహిరంగ మార్కెట్‌లో భారీగానే ఉండనుంది. గత పదేళ్లలో ఉమామహేశ్వరరావుకు అన్ని మార్గాల ద్వారా అధికారికంగా సుమారు రూ.కోటి వరకు ఆదాయం సమకూరినట్లు లెక్క తేల్చారు. ఇదే సమయంలో కుటుంబ వ్యయం సుమారు రూ.65.33 లక్షలున్నట్లు వెల్లడైంది. ఈ లెక్కన సుమారు రూ.34.66 లక్షల మేర మాత్రమే ఆయనకు ఆస్తులు ఉండాల్సి ఉండగా.. అంతకంటే దాదాపు పదిరెట్లు అదనంగా ఉన్నట్లు తేలింది. ఆయా ఆస్తులు ఎక్కువగా ఉమామహేశ్వరరావు అత్తమామల పేరిటే ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ ఆస్తులు వారికెలా వచ్చాయి, ఆదాయ మార్గాలు ఏమిటి? అనే అంశాలపై ఆరా తీయనున్నారు. ఆయా ఆస్తుల కొనుగోలుకు వారికి ఆదాయ మార్గాలు లేవని తేలితే, ఉమామహేశ్వరరావు బినామీలుగానే భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రక్రియ సాంకేతికపరమైన అంశాలతో కూడినది కావడంతో, ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని