Cyber crime: చైనా సైబర్‌ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం

విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలని చెప్పి.. చైనా ముఠాలకు నిరుద్యోగులను విక్రయిస్తున్న ఏజెంట్లు విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 18 May 2024 21:11 IST

విశాఖ: విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలని చెప్పి.. చైనా ముఠాలకు నిరుద్యోగులను విక్రయిస్తున్న ఏజెంట్లను విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. గాజువాకకు చెందిన చుక్క రాజేశ్‌ ఇంజినీరింగ్‌ చదివి గల్ఫ్‌ దేశాల్లో పని చేశాడు. 2021 నుంచి ఆ దేశాలకు మ్యాన్‌ పవర్‌ సప్లయ్‌ చేయడం మొదలుపెట్టాడు. 2023లో సంతోష్‌  సాయంతో 27 మందిని కంబోడియాకు పంపించాడు. టికెట్స్‌, వీసా పేరుతో ఒక్కొక్కరి దగ్గర రూ.90 వేల వరకు వసూలు చేసి.. వారిని చైనా ముఠాలకు విక్రయించాడు. మరో ఏజెంట్‌ ఆర్య ద్వారా ఇలాగే ఒక్కో బాధితుడి నుంచి రూ.1,10,000 వసూలు చేశాడు. హబీబ్‌, ఉమామహేశ్‌ ఏజెంట్‌ల సాయంతో దాదాపు 150 మందిని బ్యాంకాక్‌ గుండా కంబోడియాకు పంపించాడు. అక్కడ వీరిని చైనా కంపెనీలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు.

సైబర్‌ నేరాల్లో తర్ఫీదు

చైనా ముఠాల చేతికి చిక్కిన బాధితులకు సైబర్‌ నేరాల్లో శిక్షణ ఇప్పించేవారు. ఎదురు తిరిగిన వారిని చిత్రహింసలకు గురి చేసి తమ దారికి తెచ్చుకునేవారు. ఈ ముఠా నుంచి తప్పించుకున్న బాధితుడు బొత్స శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విశాఖ సీపీ రవిశంకర్‌, జాయింట్‌ సీపీ ఫక్కీరప్పల పర్యవేక్షణలో సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.భవానీ ప్రసాద్‌ విచారణ చేపేట్టారు. నిందితుడు రాజేశ్‌, ఏజెంట్స్‌ సబ్బవరపు కొండలరావు, మన్నేన జ్ఞానేశ్వర్‌రావులను అరెస్టు చేశారు. చైనా ముఠాలు భారతీయులతో సైబర్‌ క్రైమ్‌లు చేయిస్తున్న విషయాన్ని ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ ముఠా బాధితులు ఎవరైనా ఉంటే తక్షణమే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని