Road Accident: లోయలో పడిన ఆటో... ఒకరి మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం

పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం వంబరిల్లి ఘాట్ రోడ్డులో ఓ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Published : 27 May 2024 15:59 IST

సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం వంబరిల్లి ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 17 మంది గిరిజనులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘాట్ రోడ్డు ఎక్కుతున్న సమయంలో ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఆటో నుజ్జునుజ్జయింది. బాధితులంతా సీతంపేట సంత పూర్తి చేసుకొని తిరిగి ఇంటికివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన విషయం తెలుసుకున్న స్ధానికులు లోయలోకి దిగి క్షతగాత్రులను బయటకు తీసి, సీతంపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

ప్రధాన వైద్యాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు అందించారు. ప్రథమచికిత్స అనంతరం 10 మందిని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో 12 ఏళ్ల కార్తీక్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలం, ఆస్పత్రి వద్ద క్షతగాత్రులు, బాధితుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. సీతంపేట పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులను పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్ధి నిమ్మక జయకృష్ణ పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని