Bomb Threat: ప్రజాభవన్, నాంపల్లి న్యాయస్థానాలకు బాంబు బెదిరింపులు

రాజధానిలోని ప్రజాభవన్, నాంపల్లి న్యాయస్థానాల్లో బాంబులు పెట్టామంటూ వచ్చిన ఆగంతకుల ఫోన్‌కాల్స్‌ మంగళవారం పోలీసు యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించాయి.

Published : 29 May 2024 05:55 IST

జాగిలాలు, బాంబుస్క్వాడ్‌లతో పోలీసుల తనిఖీలు
చివరికి నకిలీ ఫోన్‌కాల్స్‌గా నిర్ధారణ

ప్రజాభవన్‌లో పంజాగుట్ట ఏసీపీ మనోహర్‌కుమార్‌తో మాట్లాడుతున్న మంత్రి సీతక్క

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలోని ప్రజాభవన్, నాంపల్లి న్యాయస్థానాల్లో బాంబులు పెట్టామంటూ వచ్చిన ఆగంతకుల ఫోన్‌కాల్స్‌ మంగళవారం పోలీసు యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించాయి. బాంబుస్క్వాడ్, జాగిలాలతో క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం అవి ఉత్తుత్తి బెదిరింపులేనని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉదయం 12 గంటల సమయంలో పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లక్ష్యంగా ప్రజాభవన్‌లో బాంబులు అమర్చామని చెప్పాడు. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం జాగిలాలు, బాంబుస్క్వాడ్‌లతో అక్కడకు చేరుకుంది. పంజాగుట్ట ఏసీపీ మనోహర్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి నివాసం, కార్యాలయం, కుటుంబసభ్యుల గదులు, వాహనాలు, ఆలయంలో తనిఖీలు చేశారు. దాదాపు 2 గంటల పాటు వెతికినా ఎటువంటి పేలుడు పదార్థాల ఆనవాళ్లు కనిపించకపోవటంతో నకిలీ ఫోన్‌కాల్‌గా నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే డయల్‌ 100కు మరో ఫోన్‌కాల్‌ వచ్చింది. నాంపల్లి న్యాయస్థానంలో బాంబులు అమర్చామని చెప్పాడు. అక్కడా సోదాలు చేసిన పోలీసు బృందాలు అది కూడా నకిలీ కాల్‌గా తేల్చారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు ఫోన్‌కాల్స్‌ చేసింది ఒక్కరే కావొచ్చని భావిస్తున్నారు. ఫోన్‌ నంబరు ఆధారంగా దుండగుడి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. బాంబు బెదిరింపు విషయం తెలియగానే మంత్రి సీతక్క ప్రజాభవన్‌కు చేరారు. భట్టి విక్రమార్క అధికార నివాసానికి వెళ్లి అధికారులతో మాట్లాడారు. భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. కాగా ముషీరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ఫోన్‌ చేసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని