Atiq killers: ‘గ్యాంగ్‌స్టర్లను అందుకే చంపాం’.. యూపీ కాల్పుల నిందితులు

తాము గుర్తింపు పొందేందుకే గ్యాంగ్‌స్టర్‌ (UP Gangster), మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmad), అతడి సోదరుడు అష్రఫ్‌లను చంపినట్లు పోలీసుల విచారణలో  యూపీ కాల్పుల నిందితులు వెల్లడించారు. 

Updated : 20 Apr 2023 10:51 IST

లఖ్‌నవూ: రాజకీయ నేతగా ఎదిగిన ఉత్తర్‌ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌ (UP Gangster), మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌(Atiq Ahmad), అతడి సోదరుడు అష్రఫ్‌లను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతీక్‌ గ్యాంగ్‌ను ఖతం చేసి, పేరు సంపాదించాలనే.. వారిపై కాల్పులు జరిపామని నిందితులు వెల్లడించినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

‘అతీక్‌, అష్రఫ్‌లను పోలీసు కస్టడీకి ఇచ్చినట్లు తెలియగానే వారిని చంపాలని నిర్ణయించుకున్నాం. అందుకే జర్నలిస్టు వేషంలో వెళ్లి అవకాశం దొరకగానే కాల్పులు జరిపాం. అతీక్‌పై కాల్పులు జరిపిన తర్వాత అక్కడినుంచి పారిపోవడం మా ఉద్దేశం కాదు. అతీక్‌, అష్రఫ్‌లను మట్టుపెట్టడం ద్వారా రాష్ట్రంలో మాకంటూ పేరు, గుర్తింపు తెచ్చుకోవాలనేదే మా లక్ష్యం. భవిష్యత్తులో తప్పకుండా ప్రయోజనం పొందుతాం’ అని విచారణ సమయంలో నిందితులు తెలిపిన విషయాలను పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు.

ఓ కేసు విచారణ నిమిత్తం అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రఫ్‌లను తమ కస్టడీకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిపై తుపాకులతో అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. వారిని లావ్లేష్‌ తివారీ (22), మోహిత్‌ అలియాస్‌ సన్నీ (22), అరుణ్‌ మౌర్య (18)లుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

బాందాకు చెందిన లావ్లేష్‌ తివారీ జులాయి అని.. డ్రగ్స్‌కు బానిసయ్యాడని స్థానికులు వెల్లడించారు. అతనిపై ఇదివరకే కేసులు ఉన్నాయని, గతంలోనూ జైలుకు వెళ్లివచ్చాడని తెలిపారు. నేరసామ్రాజ్యంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కంటుండేవాడని స్థానికులు వెల్లడించడం గమనార్హం. మరో నిందితుడు మోహిత్‌ కూడా అతని స్వస్థలంలో పదేళ్లుగా ఉండటం లేదని, పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లాడని స్థానికులు తెలిపారు. మరో నిందితుడు అరుణ్‌ మౌర్య నివాసముండే కాస్‌గంజ్‌ తాజా ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికే తల్లిదండ్రులను కోల్పోయిన మౌర్య.. దశాబ్దం క్రితమే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిపోయినట్లు అక్కడివారు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని