Lasya Nanditha: కారు ప్రమాదంలో భారాస ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూత

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు. కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.

Updated : 23 Feb 2024 12:33 IST

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత(37) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె పీఏ ఆకాశ్‌, డ్రైవర్‌  తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఎమ్మెల్యే మృతదేహాన్ని పటాన్‌చెరు ఆస్పత్రికి తరలించారు.

వెంటాడిన మృత్యువు..

ఇటీవల ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. నల్గొండలో భారాస బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఇంతలోనే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది డిసెంబర్‌లో సికింద్రాబాద్‌లో ఓ కార్యక్రమానికి వెళ్లిన లాస్య లిఫ్టులో ఇరుక్కుపోయిన సంగతి తెలిపిందే. ఓవర్‌లోడ్‌ కారణంగా లిఫ్ట్‌ కిందకి పడిపోవడంతో అందులో చిక్కుకుపోయారు.

దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఏడాది కాలంలోనే తండ్రి, కూతురు మృతి చెందడం.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. 1987లో హైదరాబాద్‌లో జన్మించిన లాస్య నందిత.. కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2016లో సాయన్నతోపాటు భారాసలో చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2021 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భాజపా అభ్యర్థిపై 17 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి..

నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

లాస్య నందిత మృతిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందారని.. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని