Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అరెస్ట్‌

దిల్లీ మద్యం కేసు (Delhi liquor case)లో భారాస ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ (CBI) అరెస్ట్‌ చేసింది. వైద్య పరీక్షల అనంతరం బుధవారం ఆయన్ను కోర్టులో హాజరుపరచనుంది.

Updated : 08 Feb 2023 14:38 IST

హైదరాబాద్‌: దిల్లీ మద్యం కేసు (Delhi liquor case) వ్యవహారంలో మరొకరు అరెస్టయ్యారు. భారాస ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ (సీఏ) గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ (CBI) అరెస్ట్‌ చేసింది. దిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని.. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

దర్యాప్తులో భాగంగా మంగళవారం రాత్రి దిల్లీలో బుచ్చిబాబును సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపిన అధికారులు.. బుధవారం ఉదయం అరెస్ట్‌ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వైద్య పరీక్షల అనంతరం బుచ్చిబాబును రౌస్‌ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.

మరొకరిని అరెస్టు చేసిన ఈడీ..

దిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఈడీ) మరొకరిని అరెస్టు చేసింది. మద్యం విధానంలో మార్పులకు కీలకపాత్ర వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ మల్హోత్రాను ఈడీ అదుపులోకి తీసుకుంది. బుధవారం ఆయనను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. గత రాత్రే మల్హోత్రాను కస్టడీలోకి తీసుకోగా.. ఈరోజు ఉదయం అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారికంగా ప్రకటించింది. గౌతమ్ మల్హోత్రాకు మద్యం వ్యాపారులతో సన్నిహిత వ్యాపార సంబంధాలు ఉన్నట్లు పలు ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొంది. ఓ రాజకీయ పార్టీకి చెందిన పలువురు నేతలతో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపింది. మద్యం విధానం రూపకల్పన సమయంలో వ్యాపార లావాదేవీలు జరపడంతో పాటు.. రాజకీయ పార్టీకి చెందిన వారితో కలిసి ఆర్థిక లావాదేవీల్లో భాగస్వామ్యం ఉన్నట్లు ఈడీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని