Bus Driver: ప్రాణాలు పోతున్నా.. 48 మందిని కాపాడాడు

ఓ వైపు తన ప్రాణం పోతున్నా.. సమయస్ఫూర్తితో వ్యవహరించిన బస్సు డ్రైవర్‌ 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. 

Published : 29 Oct 2023 12:49 IST

భువనేశ్వర్‌: విధి నిర్వహణలో తన ప్రాణం పోతున్నా.. అతను కర్తవ్యాన్ని మరువలేదు. గుండెల్లో తీవ్రమైన నొప్పి.. భరించలేని బాధ వేధిస్తున్నా.. తనను నమ్మి బస్సు ఎక్కిన వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడాడు. ఒడిశాలోని ఓ బస్సు డ్రైవర్‌కు గుండె పోటు వచ్చింది. ఆ సమయంలో అతడు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో 48 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. కంధమాల్‌ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు ఒడిశాలోని కంధమాల్‌ జిల్లా శరణ్‌ఘర్‌ నుంచి 48 మంది ప్రయాణికులతో భువనేశ్వర్‌కు బయల్దేరింది. బస్సు కంధమాల్‌ జిల్లా పబురియా గ్రామానికి చేరుకునే సరికి డ్రైవర్‌ సనా ప్రధాన్‌కు ఛాతీలో తీవ్రమైన నొప్పి మొదలైంది. క్రమంగా నొప్పి ఎక్కువ అయ్యింది.  అయితే.. బస్సుపై నియంత్రణ కోల్పోకుండా.. కొద్ది దూరం వెళ్లాక బస్సును ఆపేందుకు రోడ్డు పక్కనే ఉన్న గోడకు ఢీకొట్టాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో డ్రైవర్‌ మృతి చెందినట్లు తెలిపారు. ఓ పక్క ప్రాణాలు పోతున్నా.. సరైన సమయంలో బస్సును ఆపి తమకు ప్రాణభిక్ష పెట్టాడని ప్రయాణికులు డ్రైవర్‌ తెగువను కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని