Cambodia job scam: మోసం చేయడమే ఉద్యోగం

సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. మిత్రుడు అజయ్‌ సూచనతో జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన సాయిప్రసాద్‌ అనే ఏజెంట్‌ను కలిశాడు.

Updated : 26 May 2024 07:39 IST

ఒప్పుకోకుంటే బెదిరింపులు, దాడులు
పాస్‌పోర్టు లాక్కొని రోజుకు 15-16 గంటల పని
ఉపాధి కోసం వెళ్లి కంబోడియా ముఠాల చెరలో చిక్కిన బందీల దుస్థితి

ఈనాడు, హైదరాబాద్‌: సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. మిత్రుడు అజయ్‌ సూచనతో జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన సాయిప్రసాద్‌ అనే ఏజెంట్‌ను కలిశాడు. రూ.1.4లక్షలు తీసుకున్న సాయిప్రసాద్‌.. మరో ముగ్గురితో కలిసి శివను గత జనవరిలో కంబోడియాకు పంపించాడు. నెలకు 950 యూఎస్‌ డాలర్ల వేతనంతో ఉద్యోగం అని చెప్పాడు. తాను సైబర్‌ నేరస్థుల ముఠా చేతిలో బందీగా మారానని అక్కడికి వెళ్లాకగానీ శివ తెలుసుకోలేకపోయారు. అతడి పాస్‌పోర్టు లాక్కొని బలవంతంగా సైబర్‌ నేరాలు చేయించిందా ముఠా. మూడునెలల తర్వాత శివ అదను చూసి భారత రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేసి అక్కడి అధికారుల సహకారంతో బయటపడగలిగారు. ఇక్కడికి వచ్చాక సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏజెంట్లను అరెస్ట్‌ చేశారు. అదే క్యాంపులో తెలుగువారు సహా వందల మంది భారత యువకులున్నారు. ఇటీవలే బందీలు తెగించి శిబిరాల నుంచి బయటికి వచ్చి కంబోడియాలో ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం విశాఖపట్నానికి చెందిన 24 మంది యువకులు తిరిగి స్వస్థలాలకు వచ్చారు. అక్కడ ఇంకా క్యాంపులున్నాయనే సమాచారంతో తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌ సీఎస్‌బీ) తాజాగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

వియత్నాం సరిహద్దుల్లో శిబిరాలు

విదేశీ సైబర్‌ నేరగాళ్ల ముఠాలు సామాజిక మాధ్యమాల్లో ఆకర్షణీయ ప్రకటనలిస్తూ ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. వాటిని చూసి ఏజెంట్లు సంప్రదిస్తున్నారు. తమ కంపెనీల్లో ఉద్యోగావకాశాలున్నాయని.. యువకుల్ని పంపిస్తే భారీమొత్తంలో కమీషన్‌ ఇస్తామని ఆశపెడుతున్నారు. వారి మాటలు నమ్మిన ఏజెంట్లు.. ఉద్యోగావకాశాల కోసం తమ వద్దకు వచ్చే యువతను విదేశాలకు పంపిస్తున్నారు. అలా కంబోడియాకు వచ్చే యువకులను ముఠా సభ్యులు శిబిరాలకు తరలించి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుంటున్నారు. అక్కడ కొద్దిరోజులపాటు సైబర్‌ నేరాలు ఎలా చేయాలనే అంశంపై శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వీరితోనే ఫోన్లు చేయించి మోసాలు చేయిస్తున్నారు. ఒప్పుకోకుంటే బెదిరింపులకు పాల్పడటంతోపాటు పలు సందర్భాల్లో తీవ్రంగా కొడుతున్నారు. ఒక్కో క్యాంపులో 500-600 మందితో ఇలా మోసాలు చేయిస్తున్నారు. అలాంటివి కంబోడియాలో పలుచోట్ల ఉన్నట్లు.. ముఖ్యంగా వియత్నాం సరిహద్దుల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ముఠాల వెనక చైనా దేశీయుల హస్తముందని సమాచారం.

రూ.500 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు గుర్తింపు 

ఒకసారి శిబిరంలోకి ప్రవేశించాక తిరిగి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. సైబర్‌ నేరాలు చేసే క్రమంలో బృందాలుగా విడగొడుతున్నారు. ఒక బృందం బాధితుల్ని వలలో వేసుకుంటే.. బాధితుల నుంచి డబ్బులు రాబట్టే పనిని మరో బృందంతో చేయిస్తున్నారు. ఎక్కువగా భారతీయులనే లక్ష్యంగా చేసుకొని ఈ నేరాలు చేయిస్తున్నారు. బాధితులు తెలుగువారైతే ఆ భాషలోనే మాట్లాడాలని ఆదేశాలిస్తున్నారు. ఒక్కొక్కరితో రోజుకు 15-16 గంటలపాటు పనిచేయిస్తున్నారు. ఫెడెక్స్‌ కొరియర్, స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులకు సంబంధించిన మోసాలు చేయిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అలా చేసినందుకు వేతనం ఇస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక కొందరు యువకులు.. ఒకవేళ ఎంబసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిస్తే ఏమవుతుందోననే భయంతో మరికొందరు శిబిరాల్లోనే మగ్గిపోతున్నారు. ఈ మోసాలపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు అందుతుండటంతో కేంద్రహోంశాఖ, విదేశీ వ్యవహారాలశాఖ, ఇండియన్‌ సైబర్‌క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) ప్రత్యేక దృష్టి సారించాయి. భారత్‌లోని బాధితుల నుంచి రూ.500కోట్ల వరకు కొల్లగొట్టినట్లు ప్రాథమికంగా సమాచారం సేకరించారు. అక్కడి శిబిరాల్లో తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల యువకులున్నట్లు వెల్లడి కావడంతో కంబోడియాలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని