Bangalore Rave Party: రేవ్‌ పార్టీలో తెలుగు నటులు.. నటి హేమ కూడా హాజరు

బెంగళూరు నగర శివారులో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్‌ పార్టీకి తెలుగు సినీ నటి హేమ హాజరైనట్లు నగర పోలీసు కమిషనర్‌ దయానంద్‌ మంగళవారం ప్రకటించారు. ‘నేనేమీ ఆ పార్టీకి హాజరు కాలేదు’ అంటూ ఆమె సోమవారం ఓ వీడియో విడుదల చేయడంతో పోలీసులు ఈ వివరణ ఇచ్చారు.

Updated : 22 May 2024 07:11 IST

బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ వెల్లడి

రేవ్‌ పార్టీకి హేమ హాజరైనట్లు పోలీసులు విడుదల చేసిన చిత్రం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: బెంగళూరు నగర శివారులో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్‌ పార్టీకి తెలుగు సినీ నటి హేమ హాజరైనట్లు నగర పోలీసు కమిషనర్‌ దయానంద్‌ మంగళవారం ప్రకటించారు. ‘నేనేమీ ఆ పార్టీకి హాజరు కాలేదు’ అంటూ ఆమె సోమవారం ఓ వీడియో విడుదల చేయడంతో పోలీసులు ఈ వివరణ ఇచ్చారు. ‘రేవ్‌ పార్టీతో నాకేమీ సంబంధం లేదు. కావాలని నా పేరు ప్రచారం చేస్తున్నారు’ అని ఆమె తప్పుడు ప్రచారానికి దిగారని దయానంద్‌ వివరించారు. ఆమె ఆ కార్యక్రమానికి హాజరైనట్లు మంగళవారం ఇక్కడ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆధారాలు విడుదల చేశారు. తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతల కుటుంబీకులు హాజరైనట్లు గుర్తించామని చెప్పారు.

వారంతా మత్తు పదార్థాలు తీసుకున్నారో.. లేదో పరీక్షించడానికి రక్తనమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించామని తెలిపారు. అదుపులోకి తీసుకున్న 101 మందిలో ఐదుగురు మినహా మిగిలిన వారందరినీ పోలీసుఠాణా జామీనుపై విడుదల చేశామని, పిలిస్తే విచారణకు హాజరు కావాలని సూచించామని చెప్పారు. పార్టీలో మత్తు పదార్థాలు వాడారనే సమాచారంపై ఆ రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్‌ తీవ్రంగా స్పందించారు. ఇలాంటివి ఇకపై జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రేవ్‌ పార్టీ నిర్వహించిన చోట భారీగా మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ధ్రువీకరించారు. వాటి విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

పోలీసులు అరెస్టు చేసిన ‘రేవ్‌ పార్టీ’ నిందితులు

ఐదుగురు నిందితుల అరెస్టు 

రేవ్‌పార్టీకి కారకులంటూ ఐదుగురు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రణధీర్, మహ్మద్‌ సిద్ధికి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబును నగర న్యాయస్థానం ముందు మంగళవారం హాజరు పరచి, పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు. వీరంతా హైదరాబాద్‌కు చెందిన వారని గుర్తించామని నగర పోలీసు కమిషనర్‌ దయానంద్‌ వెల్లడించారు. రేవ్‌పార్టీలో ఎండీఎంఏ మాత్రలు, హైడ్రోగాంజా, కొకైన్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు