crime news: చిన్నారి వైరల్‌ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య

తాజాగా వైరలైన తమ చిన్నారికి సంబంధించిన వీడియోపై నెటిజన్ల విమర్శలను తట్టుకోలేని ఓ మహిళ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

Updated : 20 May 2024 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్ పైకప్పు ప్లాస్టిక్ షీట్‌కు ఓ చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ ఉన్న వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో స్థానికులు చిన్నారిని కాపాడారు. స్థానికులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో చిన్నారి ప్రాణాలు దక్కాయి. ఇదే ఘటనపై నెటిజన్లు వ్యవహరించిన తీరు ఇప్పుడా బిడ్డకు తల్లిని దూరం చేసింది. నెట్టింట విమర్శలు తట్టుకోలేక ఆ చిన్నారి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.

చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇంటి పైకప్పుపై ప్రమాదకరంగా వేలాడుతున్న చిన్నారిని కుటుంబ సభ్యులు, స్థానికులు ఇటీవల కాపాడారు. పైకప్పు కింద ఉన్న కిటికీలోంచి బయటకు వచ్చి శిశువును రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పాపను రక్షించిన వారిని ప్రశంసించిన నెటిజన్లు.. చిన్నారి తల్లి విషయంలో దూషణలకు దిగారు. పాపను అలా నిర్లక్ష్యంగా వదిలేసినందువల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ ఆరోపించారు. ఈ విషయంలో స్థానికులు ఆమెకు అండగా నిలిచారు. తన బిడ్డను బాగా చూసుకుంటుందని, అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతుంటాయని బాసటగా నిలిచారు.

ఈ ఘటన అనంతరం చిన్నారి తల్లి కొయంబత్తూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆదివారం ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. సోషల్‌ మీడియాలో విమర్శలు, ట్రోల్స్‌ కారణంగా ఆమె మానసికంగా కుంగిపోయిందని, దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై సింగర్ చిన్మయి (Chinmayi) సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. కొందరు నెటిజన్లు విచక్షణ మరిచి చేసిన వ్యాఖ్యల వల్లే ఆ పసికందు తల్లి ఆత్మహత్య చేసుకుందన్నారు. ‘మీ ట్రోల్స్‌ వల్ల చిన్నారి తల్లి మరణించింది. ఇప్పుడు మీ కళ్లు చల్లబడ్డాయా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని