Andhra news: ఇంటి నిర్మాణం కోసం ఇసుక తోలిస్తే.. శవం బయటపడింది

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియా రెచ్చిపోతోందనడానికి ఈ ఘటనే ఉదాహరణ.

Updated : 12 Apr 2024 17:33 IST

చీరాల: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియా రెచ్చిపోతోందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. స్మశానాలను సైతం వదలకుండా అర్ధరాత్రి వేళ  ఇష్టారాజ్యంగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో ఇంటి నిర్మాణం కోసం ఇసుక తోలిస్తే శవం బయటపడిందని భవన యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. పద్మనాభంపేటలో నివాసముంటున్న కాగితాల లక్ష్మి నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. బేస్ మట్టం పూడ్చేందుకు స్థానిక వ్యాపారులతో మాట్లాడి ట్రాక్టర్లతో ఇసుక తోలించారు. ఇంటి పని కోసం వచ్చిన కూలీలు బేస్ మట్టాన్ని ఇసుకతో నింపేందుకు ఇసుక తీస్తుండగా అందులో పురుషుడి శవం బయటపడింది. దీంతో భయాందోళనకు గురైన కూలీలు విషయాన్ని ఇంటి యజమానికి తెలియజేశారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

బయటపడ్డ మృతదేహాన్ని రెండు రోజుల క్రితం పూడ్చిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. మొండెం మాత్రమే ఉండటంతో జేసీబీతో ఇసుక తవ్వే క్రమంలో తల ఊడిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చీరాల రూరల్ సీఐ సత్యనారాయణ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం ఎక్కడిది? ఇసుక ఎక్కడ నుంచి తరలించారు? ఏం జరిగింది? అనే వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని