Bitcoin Ponzi Scam: బిట్‌కాయిన్‌ పెట్టుబడుల పేరుతో ₹6,600 కోట్ల మోసం

బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ప్రజల నుంచి రూ.6,600 కోట్లు వసూలు చేసిన కేసులో ముంబయికి చెందిన సింపీ భరద్వాజ్‌ అనే మహిళను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

Published : 19 Dec 2023 20:23 IST

దిల్లీ: బిట్‌కాయిన్‌ (Bitcoin)లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ముంబయికి చెందిన సింపీ భరద్వాజ్‌ అనే మహిళను అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం కేసుకు సంబంధించిన వివరాలను ఈడీ వెల్లడించింది. 

ముంబయికి చెందిన ‘వేరియబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే సంస్థకు సింపీ భరద్వాజ్‌ ఆమె భర్త అజయ్‌ భరద్వాజ్‌తోపాటు.. అమిత్‌ భరద్వాజ్‌, వివేక్‌ భరద్వాజ్‌, మహేందర్‌ భరద్వాజ్‌ అనే వ్యక్తులు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ ‘గెయిన్‌ బిట్‌కాయిన్‌ పోంజీ స్కీమ్‌’ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ-లెవల్‌ మార్కెటింగ్‌ (MLM) పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబయి, దిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి రూ.6,600 కోట్లు వసూలు చేశారు. ఈ మొత్తాన్ని విదేశాల్లోని పలు సంస్థల ఖాతాలకు బదిలీ చేశారు. అనంతరం ఆ డబ్బుతో విదేశాల్లో పెద్ద ఎత్తున స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ వెల్లడించింది. 

ఈ సంస్థ మోసాలపై దిల్లీ, ముంబయిలో పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. దిల్లీ, ముంబయిలోని సంస్థ ప్రమోటర్ల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఖరీదైన మూడు లగ్జరీ కార్లు, రూ.18.91 లక్షల నగదు, రూ.69 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా సింపీ భరద్వాజ్‌, అజయ్‌ భరద్వాజ్‌, మహేందర్ భరద్వాజ్‌లను పేర్కొంటూ, వారిపై నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసింది. ఇందులో సింపీ భరద్వాజ్‌ను డిసెంబరు 17న ముంబయిలో అరెస్టు చేసి, మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టగా డిసెంబరు 26 వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. మరో ఇద్దరు నిందితులు అజయ్‌, మహేందర్‌లు పరారీలో ఉన్నట్లు ఈడీ తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని