Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌- బస్తర్‌- దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో గురువారం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Published : 24 May 2024 03:28 IST

ఏడుగురు మావోయిస్టుల మృతి
ఈ ఏడాది ఇప్పటివరకూ 112 మంది హతం

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌- బస్తర్‌- దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో గురువారం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో ప్లాటూన్‌ నంబరు-16, ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈక్రమంలో కేంద్ర పారామిలిటరీ బలగాలతోపాటు డీఆర్జీ, ఎస్‌టీఎఫ్, బస్తర్‌ ఫైటర్స్‌ సంయుక్తంగా కూంబింగ్‌ చేపట్టాయి. ఓర్చా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రేకవాయి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో గాలింపు నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు ప్రతిస్పందించి ఎదురు కాల్పులకు దిగాయి. గురువారం రాత్రి వరకూ పరస్పరకాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది మావోయిస్టులు తీవ్రంగా గాయపడినట్లు పోలీస్‌ అధికారులు భావిస్తున్నారు. మృతి చెందిన వారిని గుర్తించేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన 7 ఆయుధాలను, భారీ ఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో కలిపి ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకూ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 112కి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని