Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పుర్‌- దంతేవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

Published : 07 Jun 2024 20:57 IST

నారాయణ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నారాయణ్‌పుర్‌- దంతేవాడ జిల్లాల సరిహద్దులోని గోబెల్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు (Maoists) మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ)తో కలిసి సంయుక్త ఆపరేషన్‌ చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతులను నారాయణ్‌పుర్‌, కొండగావ్‌, దంతేవాడ, బస్తర్‌ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు.

తాజా ఎన్‌కౌంటర్‌తో కలిసి గత ఏడాది కాలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 122 మంది మావోయిస్టులు మృతి చెందారు. మే 23న నారాయణ్‌పుర్‌ - బిజాపుర్‌ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు మే 10న ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో 12 మంది మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని