విషజ్వరంతో మృతి

మండలంలోని సంగాయిగూడేనికి చెందిన గెడ శ్రీవల్లీ సాహితి (22) విష జ్వరంతో మృతి చెందింది. 

Updated : 26 Nov 2022 04:49 IST

శ్రీవల్లీ సాహితి (పాత చిత్రం)

దేవరపల్లి: మండలంలోని సంగాయిగూడేనికి చెందిన గెడ శ్రీవల్లీ సాహితి (22) విష జ్వరంతో మృతి చెందింది.  కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీవల్లీ సాహితి ఐదు రోజుల క్రితం జ్వరంతో దేవరపల్లి, నిడదవోలు ప్రైవేటు ఆసుపత్రిల్లో చికిత్స పొందింది. ఆరోగ్యం విషమించడంతో రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా గురువారం రాత్రి మృతి చెందింది.   సంగాయిగూడేనికి చెందిన గెడ రాజు, నారాయణ దంపతులకు ఏకైక కుమార్తె శ్రీవల్లీ. తండ్రి అనారోగ్యంతో 8 సంవత్సరాల క్రితమే మృతి చెందారు. తల్లిని కంటికి రెప్పలాగా చూసుకుంటూ డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేటు కంపెనీలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తోంది.  కూతురు కోసం జీవిస్తున్న నారాయణకు ఆమె కూడా చనిపోవడంతో ఆమె రోధించినతీరు  వర్ణనాతీతం.


దారిదోపిడీ, హత్యాయత్నం కేసులో నిందితులకు ఏడేళ్ల జైలు

రాజానగరం, న్యూస్‌టుడే: దారి దోపిడీ, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ కాగిత సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసులో ఆరోపణలు రుజువుకావడంతో నిందితులు ద్వార ప్రకాష్‌ అలియాస్‌ పంతులు, గుర్రాల సాయితేజలకు రాజానగరం మొదటి అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఒక్కొక్కరికీ ఏడేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారని సీఐ పి.కాశీవిశ్వనాథం శుక్రవారం విలేకరులకు తెలిపారు. నల్లజర్ల మండలం చాదరసిగుంట గ్రామానికి చెందిన సత్యనారాయణ 2016 ఏప్రిల్‌లో ఇనుప సామగ్రి కొనుగోలుకు టాటాఏస్‌ వాహనంలో కొంతమూరు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్తూ గామన్‌ ఇండియా వంతెనపై రాత్రి సమయంలో వాహనాన్ని ఆపి నిద్రిస్తుండగా రాజమహేంద్రవరానికి చెందిన నిందితులు ప్రకాష్‌, సాయితేజలు సత్యనారాయణపై దోపిడీ, హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుపై అప్పటి సీఐ శంకరనాయక్‌ కేసు నమోదు చేసి నిందితులను కటకటాల వెనక్కి పంపారు. దర్యాప్తు అనంతరం వారిపై అభియోగపత్రం దాఖలు చేశారు. వాదోపవాదాలు పూర్తయ్యాక అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పైవిధమైన శిక్ష విధించారని సీఐ కాశీవిశ్వనాథం తెలిపారు. ఈ కేసును అదనపు పీపీ వెంకటరత్నం బాబు వాదించగా, కోర్టు కానిస్టేబుల్‌ ఎల్‌.దుర్గాప్రసాద్‌ సాక్షులను సకాలంలో హాజరుపరిచారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని