తండ్రీకొడుకుల మృతితో పుట్లగట్లగూడెంలో విషాదం

రోడ్డు ప్రమాదంలో గంటల వ్యవధిలో తండ్రీకొడుకులు మృతిచెందడంతో వారి స్వగ్రామం జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది.

Updated : 08 Dec 2022 05:01 IST

బాధిత కుటుంబానికి న్యాయం కోరుతూ గ్రామస్థుల ధర్నా  

జంగారెడ్డిగూడెం, జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గంటల వ్యవధిలో తండ్రీకొడుకులు మృతిచెందడంతో వారి స్వగ్రామం జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. గురవాయిగూడెం వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గంటా తేజ(14) ఏలూరులో చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం చనిపోయిన విషయం విదితమే. మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించిన తేజ తండ్రి వెంకన్న(40) బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. కొద్ది గంటల వ్యవధిలోనే తండ్రీకొడుకులు దుర్మరణం చెందడంతో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ తేజ మృతదేహంతో ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం పుట్లగట్లగూడెం గ్రామస్థులు సుమారు గంటన్నర పాటు ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న సీఐ బాలసురేష్‌, లక్కవరం, జంగారెడ్డిగూడెం ఎస్సైలు దుర్గామల్లేశ్వరరావు, సాగర్‌బాబు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ప్రమాద ఘటనకు సంబంధించి వెంకన్న భార్య పెద్దింట్లు ఫిర్యాదు మేరకు లక్కవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దింట్లు, వెంకన్న దంపతులకు ఇద్దరు కుమారులు. మట్టి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో కుటుంబానికి ఆధారమైన భర్త, చిన్న కుమారుడిని కోల్పోవడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పెద్ద కుమారుడు పవన్‌ పదో తరగతి చదువుతున్నాడు.

మృతదేహంతో ధర్నా చేస్తున్న గ్రామస్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని