నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో సర్పంచి దంపతుల ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో సర్పంచి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బిల్లులకు సంబంధించిన రికార్డులపై ఉపసర్పంచి సంతకం చేయకపోవడంతోనే ఆత్మహత్యకు సిద్ధమైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 31 Jan 2023 03:37 IST

ఉపసర్పంచి ఇబ్బందులు పెడుతున్నాడని ఆవేదన  

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో సర్పంచి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బిల్లులకు సంబంధించిన రికార్డులపై ఉపసర్పంచి సంతకం చేయకపోవడంతోనే ఆత్మహత్యకు సిద్ధమైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండల కేంద్రానికి చెందిన సర్పంచి సాంబారు వాణి, వార్డు సభ్యుడైన తన భర్త తిరుపతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. తిరుపతి సీసాలో తన వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒక్కసారిగా భార్యపై పోయడంతో పాటు తాను కూడా పోసుకొని నిప్పంటించుకొనేందుకు ప్రయత్నించారు.  పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. అనంతరం సర్పంచి దంపతులు మాట్లాడుతూ.. తాము రూ. 2 కోట్ల వరకు అప్పులుచేసి మరీ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని, వాటికి సంబంధించిన రికార్డులపై ఉపసర్పంచి సంతకాలు చేయడంలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న డీపీఓ జయసుధ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. గ్రామంలో రూ.90 లక్షల పనులు చేపట్టగా రూ.68.10 లక్షల మేరకు చెల్లించామని, మిగిలిన డబ్బు చెల్లించాల్సి ఉందన్నారు. పనుల పరిశీలన తర్వాత సంతకం చేస్తానని ఉప సర్పంచి చెప్పడంతో వివాదం తలెత్తిందన్నారు. సర్పంచి దంపతులపై కేసు నమోదు చేశామని నిజామాబాద్‌ రూరల్‌ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఈ ఘటనపై సీఎం కార్యాలయం నుంచి ఆరా తీసినట్లు సమాచారం.

రాత్రి సమయానికి అనూహ్యమైన మలుపు

సర్పంచి దంపతుల ఆత్మహత్యాయత్నం వ్యవహారం.. రాత్రి సమయానికి అనూహ్యమైన మలుపు తిరిగింది. ‘ఎమ్మెల్యే తమను పట్టించుకోలేదు. పార్టీలో ఎలాంటి న్యాయం జరగలేద’ని చెప్పిన సర్పంచి దంపతులు... రాత్రి విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ పనుల కోసం డబ్బులు ఖర్చు చేసి ఇబ్బంది పడటం ఏంటనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేశామన్నారు. రెండ్రోజుల కింద ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మా పరిస్థితి తెలిసి.. బకాయి బిల్లు ఇప్పిస్తానని మాటిచ్చినట్లుగా చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు