గిరిజన మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

వరంగల్‌ జిల్లా నల్లబెల్లి తహసీల్దారు తన భూమికి రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని ఆరోపిస్తూ గిరిజన మహిళా రైతు గురువారం పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు.

Published : 24 Mar 2023 05:28 IST

నల్లబెల్లి, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లా నల్లబెల్లి తహసీల్దారు తన భూమికి రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని ఆరోపిస్తూ గిరిజన మహిళా రైతు గురువారం పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో అనూహ్యంగా ఏఎస్‌ఐ కళ్లలో పురుగుల మందు పడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇవీ వివరాలు... నల్లబెల్లి మండలం రామతీర్థం శివారులోని బిల్‌నాయక్‌తండా ముచ్చింపుల పరిధిలోని 157/బీ సర్వే నంబరులో ఉన్న 35 గుంటల భూమిలో 15 గుంటలను రిజిస్ట్రేషన్‌ చేయడానికి గత శనివారం మాలోత్‌ పద్మ అనే గిరిజన మహిళా రైతు స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. అదేరోజు పత్రాలు సరిగా లేవని తహసీల్దారు మంజుల రిజిస్ట్రేషన్‌ను వాయిదా వేశారు.

తహసీల్దారు అడిగిన పత్రాలను గురువారం తీసుకురాగా పంట మీద రుణం ఉందనే కారణంతో తిరస్కరించారు. పంట రుణం తప్ప భూమిపై ఎలాంటి తాకట్టు లేదని పలుమార్లు చెప్పినా తహసీల్దారు వినలేదు. దాంతో వెంట తెచ్చుకున్న డబ్బాలోని పురుగుల మందును తాగడానికి ఆమె యత్నించగా, అక్కడే ఉన్న ఏఎస్‌ఐ రాజేశ్వరి అడ్డుకున్నారు. డబ్బాను లాక్కునే ప్రయత్నంలో పురుగుల మందు ఒలికి ఏఎస్‌ఐ కంట్లో పడింది. వెంటనే ఆమె కళ్లను నీటితో కడిగి, నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉంది. తర్వాత పద్మ కార్యాలయం ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. ఈ విషయమై తహసీల్దారు మంజులను వివరణ కోరగా... పద్మ బంధువులు తనను దూషించడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. గురువారం కలెక్టర్‌ ముఖ్యమంత్రి పర్యటనలో ఉన్నారని, రేపు కలెక్టర్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్‌ చేస్తానని బదులిచ్చినప్పటికీ వినకుండా గొడవ చేశారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని