సంక్షిప్త వార్తలు (5)
దిల్లీ మద్యం విధానంలో వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ్ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 6న తీర్పు వెల్లడించనుంది.
మాగుంట రాఘవ్ బెయిల్ పిటిషన్‌పై 6న తీర్పు
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం విధానంలో వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ్ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 6న తీర్పు వెల్లడించనుంది. ఫిబ్రవరి 11న అరెస్టయి, ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న రాఘవ్ బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ శనివారం విచారణ చేపట్టారు.
మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో ఒకేసారి 4 బోగీల్లో చోరీలు
హైదరాబాద్, న్యూస్‌టుడే: మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం రాత్రి నిమిషాల వ్యవధిలో నాలుగు బోగీల్లో నలుగురినుంచి దొంగలు బ్యాగులు, డబ్బులను చోరీ చేశారు. ప్రయాణికులు నిద్రలో ఉండగా ఈ దొంగతనాలు జరిగాయి. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన మహాలక్ష్మి రైలులోని ఎస్-8లో సికింద్రాబాద్‌కు వస్తున్నారు. ఆమె సెల్‌ఫోన్, రూ.వేయి నగదు, బ్యాంకు కార్డులున్న బ్యాగ్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఎస్-5లో ప్రయాణిస్తున్న మచిలీపట్నం సమీపం నారాయణపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జితిన్‌కుమార్ బ్యాగ్‌నూ చోరీచేశారు. అందులో రూ.35వేల నగదు ఉంది. ఎస్-13లో ప్రయాణిస్తున్న సికింద్రాబాద్ వాసి రోచల్ సూట్‌కేసు చోరీ అయింది. ఎస్-7లో ఉన్న హైదరాబాద్ మదీనాగూడకు చెందిన ప్రయాణికురాలు దివ్యకు చెందిన రూ.30వేలున్న బ్యాగును ఎత్తుకెళ్లారు.
కరెంటు తీగలు పెట్టి.. పులిని హతమార్చారు
మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని రంగపేట శివారులో పులిని హతమార్చి.. కళేబరాన్ని పాతిపెట్టిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు మంచిర్యాల డీఎఫ్‌వో శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు. మంచిర్యాలలో శనివారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రంగపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పులి గోర్లతో వ్యాపారం చేస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఉదయం ఆ గ్రామంలో అటవీశాఖ టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో నాకాబందీ నిర్వహించామన్నారు. ఇందులో బాలచందర్ అనే వ్యక్తి పులి గోర్లతో పట్టుబడ్డాడని తెలిపారు. అతన్ని విచారించగా మరో ఇద్దరు వ్యక్తులు కె.అంజి, లక్ష్మయ్యలకు ఇందులో సంబంధం ఉన్నట్టు తేలిందన్నారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం రంగపేట శివారులో తవ్వగా పులి ఎముకలు లభించాయన్నారు. నాలుగేళ్ల క్రితం కరెంటు తీగలు పెట్టి దాన్ని చంపినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులు బాలచందర్, కె.అంజి, లక్ష్మయ్యను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
చితకబాదిన టీచర్.. ఏడేళ్ల బాలుడి మృతి
పట్నా: హోమ్‌వర్క్ చేయలేదని ఓ ఉపాధ్యాయుడు ఎల్‌కేజీ చదువుతున్న ఏడేళ్ల విద్యార్థిపై ప్రతాపాన్ని చూపించాడు. ఆ దెబ్బలను తట్టుకోలేని చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. బిహార్‌లోని సహర్సా ప్రాంతానికి చెందిన ఏడేళ్ల ఆదిత్య యాదవ్ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతూ అక్కడే వసతి గృహంలో ఉంటున్నాడు. ఇచ్చిన హోమ్‌వర్క్ చేయకపోవడం, చెప్పిన పాఠాలు వినడం లేదనే కారణంతో టీచర్ సుజిత్ కుమార్ గత బుధవారం చిన్నారిని కర్రతో తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఆదిత్య హాస్టల్‌లో మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసిన తోటి విద్యార్థులు సుజిత్‌కు తెలియజేశారు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు.
తేనెటీగల దాడిలో భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
రావికమతం, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గర్నికంలో తేనెటీగలు దాడి చేయడంతో ఓ రైతు మృతి చెందగా ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆర్లె కామునాయుడు(65), నూకాలమ్మ దంపతులది సాధారణ రైతు కుటుంబం. శుక్రవారం సాయంత్రం నూకాలమ్మ చెరకు తోటలో గడ్డి కోస్తుండగా తేనెటీగలు ఆమెపై దాడి చేశాయి. కేకలు వేయడంతో సమీపంలో గొర్రెలు మేపుతున్న భర్త కామునాయుడు వెళ్లి తేనెటీగల నుంచి ఆమెను రక్షించే ప్రయత్నం చేశాడు. ఆయనపైనా తేనెటీగలు దాడి చేశాయి. వీరి కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకుని వారిని రావికమతం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో అర్ధరాత్రి విశాఖ కేజీహెచ్‌కు పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ కామునాయుడు శనివారం మృతి చెందాడు. నూకాలమ్మ ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు బంధువులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Accident: ఎన్డీఆర్ఎఫ్ను తొలుత అప్రమత్తం చేసింది అతడే..
-
World News
Odisha Train Accident: నా హృదయం ముక్కలైంది.. రైలు ప్రమాదంపై బైడెన్ దిగ్భ్రాంతి
-
General News
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
-
Crime News
Kakinada: గుడిలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం